హోదా కోసం.. సింహనాదం
‘ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించడానికి ఆయన ఎవరు. రాష్ట్రం చంద్రబాబు నాయన సొత్తా లేక ఆయన అత్తగారి ఆస్తి అనుకున్నారా. ఐదు కోట్ల అంధ్రుల భవిష్యత్‌ను కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. వెంకయ్యనాయుడు ఐదు కాదు పదేళ్లు అన్నారు. పదిహేనేళ్లు హోదా కావాలన్న చంద్రబాబు మాట మార్చారు. అర్ధరాత్రి నిర్ణయాలను స్వాగతించడానికి బాబు ఎవరు’ అని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. ‘అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిగిచిన వ్యక్తి.. ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడవడానికీ వెనుకాడలేదు’ అంటూ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను నిండా ముంచేసిన చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. ‘వెంకయ్యనాయుడు ప్లేట్ మార్చాడు.
మేక మెడకు ఇలా వేలాడుతాయ్ కదా అదే ప్రత్యేక హోదా అని వెంకయ్య అంటాడు’ అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి తీరుపై ధ్వజమెత్తారు. ‘జైట్లీ ప్యాకేజీలో పేర్కొన్న పరిశ్రమల రాయితీలు శనగలు.. బెల్లాలకు సరిపోవు. మనం అడగడం మానేస్తే.. పోరాటం ఆపేస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా మన హక్కు. దాని కోసం పోరాటం చేద్దాం’ అంటూ యువతకు, విద్యార్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వెల్లువలా తరలివచ్చిన విద్యార్థులతో ఏలూరు నగరం కిటకిటలాడింది. ప్రత్యేక హోదా నినాదాలతో మార్మోగింది. ఆటంకాలను అధిగమించి విద్యార్థి లోకం కదం తొక్కింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో తెలుగుదేశం, బీజేపీ ఆడుతున్న కపట నాటకాలపై యువతను చైతన్యపరిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఏలూరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమం విజయవంతమైంది. వరుణుడు ఆటంకం కలిగిస్తాడని భావించినా చివరకు కరుణించాడు.
వర్షం కురుస్తున్నా ఉదయం 9 గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి విద్యార్థి లోకం ఏలూరు తరలివచ్చింది. సీఆర్ రెడ్డి మహిళా కళాశాల సమీపంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లోని రెండు అంతస్తులు విద్యార్థులు, యువతతో కిక్కిరిసిపోయాయి. హాల్ బయట వేలాదిమంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఉండిపోయారు. వారంతా యువభేరి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్క్రీన్స్‌లో చూశారు. తమ భవిష్యత్‌ను కాపాడేందుకు పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు విద్యార్థులు పోటీపడ్డారు.
సంజీవని అన్నారు.. ప్లేటు ఫిరాయించారు
విద్యార్థులను, నిరుద్యోగ యువతను ఉద్దేశంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవని అని ఆనాడు చెప్పిన నాయకులు ప్రస్తుతం సంజీవని కాదని ప్రస్తుతం మాట మారుస్తున్నాయని విమర్శించారు. తెలుగుదేశం, బీజేపీలు మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా ఇస్తామని ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్లేటు ఫిరాయించాయని ధ్వజమెత్తారు. ‘ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతిస్తున్నారట. అర్ధరాత్రి నిర్ణయాలను స్వాగతించడానికి చంద్రబాబు ఎవరు. రాష్ట్రం చంద్రబాబు నాయన సొత్తా లేక ఆయన అత్తగారి ఆస్తి అనుకున్నారా’ అని వైఎస్ జగన్ నిలదీశారు. ఐదు కోట్ల అంధ్రుల భవిష్యత్‌ను కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు హోదా ఐదు కాదు పదేళ్లు అన్నారని, పదిహేనేళ్లు హోదా కావాలన్న చంద్రబాబు మాట మార్చారని ఎద్దేవా చేశారు.
అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిగిచిన చంద్రబాబు ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి వెనుకాడలేదని చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. ‘వెంకయ్యనాయుడు ప్లేట్ మార్చాడు. మేక మెడకు ఇలా వేలాడుతాయ్ కదా అదే ప్రత్యేక హోదా అని వెంకయ్య అంటాడు’ అంటూ ధ్వజమెత్తారు. జైట్లీ ప్యాకేజీలో పేర్కొన్న పరిశ్రమల రాయితీలు శనగలు.. బెల్లాలకు సరిపోవన్నారు. ‘మనం అడగడం మానేస్తే.. పోరాటం ఆపేస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా మన హక్కు. దాని కోసం పోరాటం చేద్దాం’ అంటూ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
కదిలించిన విద్యార్థుల మాటలు
ముఖాముఖిలో భాగంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విద్యార్థులు చెప్పిన మాటలు వైఎస్ జగన్‌ను కదలించాయి. బీ ఫార్మసీ విద్యార్థిని మౌనిక వైఎస్ జగన్‌తో మాట్లాడుతూ ‘అన్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో చాలా కండిషన్స్ పెడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఇలా కండిషన్స్ లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలన్నా’ అని విజ్ఞప్తి చేయగా.. ‘దివంగత నేత, ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు నిజంగా గొప్ప నాయకులు. ఆయన పథకాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ప్రధానమైంది. దానిని ఒక పద్ధతి ప్రకారం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. పేదవాళ్లు ఎవరైనా ఇంజినీరింగ్, డాక్టర్ చదివించేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఫీజులు కట్టేందుకు పేదవారు అప్పులు చేసుకుని, ఇళ్లలో ఉన్నవి అమ్ముకుని చదువుకోవాల్సిన దుస్థితి దాపురించింది. నేను అధికారంలోకి వచ్చాక ఫీజు పథకాన్ని పూర్తిస్థాయిలో రీయింబర్స్ చేస్తాను.
పేద పిల్లల్ని చదివించేందుకు అన్నగా.. ముఖ్యమంత్రి హోదాలో ప్రతి పిల్లాడికీ మెస్‌కు నెలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.24 వేలు ఇస్తాను.
నేను ఎప్పుడైనా చనిపోతే నా ఫొటో నాన్న ఫొటో పక్కన ప్రతి ఇంట్లో పెట్టుకునే స్థాయిలో పథకాలు అమలు చేస్తాను’ అని వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ చంద్రబాబుకు, సింగపూర్‌కు లింకేంటని, ఈ నాయకుల మాటల్ని ఎలా నమ్మాలని, అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి మనకు అవసరమా అని, పరిశ్రమలు తెస్తానంటూ విదేశీ పర్యటనలు చేస్తున్న చంద్రబాబు రెండేళ్లలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారని, ఏ మేరకు పెట్టుబడులు ఆకర్షించారని ప్రశ్నించారు. రైతులను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తున్న వాళ్లను జైలులో పెట్టే చట్టాలు లేవా అని ఓ విద్యార్థి అడిగితే.. హోదా అడుగుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారని మరో విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాధానం ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
ఎప్పటికైనా హోదా సాధిద్దాం
విద్యార్థులను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రైతులను, డ్వాక్రా మహిళలను, ఉద్యోగాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలు రాని వారిని, యువతను ప్రతి ఒక్కరినీ మోసం చేశారని వివరించారు. హోదా వస్తే రాయితీలు వస్తాయని, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రం ఇంపాజిబుల్ అనుకున్నదే వాళ్లు సాధించారు. మనం ప్రత్యేక హోదా సాధించలేమా. ఒక్కరోజు, ఒక సంవత్సరంలో కాకపోయినా ఏదో రోజు సాధించే తీరుతాం. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మనం ఓట్లు వేసి గెలిపిద్దాం. అలాగైనా వీళ్లకు బుద్ధి వస్తుంది’ అంటూ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. తొలుత వెల్లువలా తరలివచ్చిన విద్యార్థులు, యువతను చూసి జగన్మోహనరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడకు వచ్చిన ప్రతి చెల్లెమ్మకు, సోదరుడికి.. కింద హాలులో ఉన్నవారికి, బయట వేసిన టెంట్లలో ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. విద్యార్థులతో వైఎస్ జగన్ భేటీ కావడానికి ముందు జిల్లాకు చెందిన పలువురు విద్యావేత్తలు, మేధావులు ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రసంగించారు. డెంటల్ కాలేజీ హెచ్ఓడీ మహబూబ్ షేక్, ఏయూ ప్రొఫెసర్ సాంబిరెడ్డి, సీఆర్ఆర్ కాలేజీ రిటైర్ ప్రొఫెసర్ బి.పద్మవాణి, రిటైర్డ్ ప్రొఫెసర్, పాలిటెక్నికల్ ప్రిన్సిపల్ ఎం.సంపతరావు, డాక్టర్ ఎస్.కృష్ణ భగవాన్, ప్రముఖ న్యాయవాది బీవీ కృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్ అబ్రహం తదితరులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
వైఎస్సార్ సీపీలో నూతనోత్సాహం
యువభేరి కార్యక్రమంలో విద్యార్థులు, యువత నుంచి లభించిన స్పందన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నాయకత్వంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, విద్యార్థి, యువజన నేతలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు కృషి చేశారు. యువభేరి ముగిసిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఇంటికి వెళ్లి కొద్దిసేపు ఉన్నారు.
తరలి వచ్చిన నాయకులు.. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఏలూరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమం విజయవంతం కావడానికి పార్టీ జిల్లా నాయకులు విశేష కృషి చేశారు. నాయకులంతా యువభేరి కార్యక్రమానికి హాజరైనప్పటికీ.. విద్యార్థులు, యువత కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి వారిని మాత్రమే వేదికపై కూర్చోబెట్టారు. నాయకులంతా వేదిక దిగువన కూర్చున్నారు. కాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని జిల్లా నాయకులను సమన్వయం చేసుకుంటూ శ్రీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మేకా ప్రతాప అప్పారావు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, విద్యార్థి విభాగం నాయకుడు సలాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, సీఈసీ సభ్యుడు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ఘంటా మురళి, తానేటి వనిత, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాస్, దయాల నవీన్‌బాబు, ఎస్.రాజీవ్‌కృష్ణ, పార్టీ రాష్ట్ర నాయకులు తోట గోపి, గుణ్ణం నాగబాబు, కొయ్యే మోషేన్‌రాజు, మేరుగ నాగార్జున, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, చీర్ల రాధయ్య, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, నాయకులు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, ఊదరగొండి చంద్రమౌళి, జక్కంపూడి రాజా, బొద్దాని శ్రీనివాస్, కారుమంచి రమేష్, డేవిడ్ లంకపల్లి, బాలిబోయిన నవహర్ష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.