ఆది కవి పుట్టిన చోటే ఆది ఆంధ్రకవి జననం | andhrakavi jananam | Sakshi
Sakshi News home page

ఆది కవి పుట్టిన చోటే ఆది ఆంధ్రకవి జననం

Published Sun, Sep 18 2016 9:27 PM | Last Updated on Sat, Aug 18 2018 4:23 PM

ఆది కవి పుట్టిన చోటే ఆది ఆంధ్రకవి జననం - Sakshi

ఆది కవి పుట్టిన చోటే ఆది ఆంధ్రకవి జననం

  • కుసుమ ధర్మన్న సాహితీసమాలోచనæసభలో తెలకపల్లి రవి
  • ఘనంగా సప్తగ్రంథాల ఆవిష్కరణ
  •  
     రాజమహేంద్రవరం కల్చరల్‌:
    ‘ఆదికవి పుట్టిన చోటునే ఆదిఆంధ్రకవి జన్మించాడు. వేదనాగీతాలు జనించాయ’ని విశ్రాంత తెలుగు ఆచార్యుడు తెలకపల్లి రవి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బొమ్మన రామచంద్రరావు ఛాంబరు ఆఫ్‌ కామర్సుహాలులో జరిగిన ‘కుసుమధర్మన్న సాహితీసమాలోచన సదస్సు’కు ఆహ్వానసంఘం అధ్యక్షుడు ఇ. విజయపాల్‌ అధ్యక్షత వహించారు. తెలకపల్లి రవి మాట్లాడుతూ  స్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా నడిచిన మద్యపాన నిషేధంపై కుసుమ ధర్మన్న రచనలు చేశారన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలను ఇవ్వాలని 1932లోనే అంబేడ్కర్‌ చెప్పారన్నారు. మాజీ ఎంపీ డీవీజీ శంకర‡రావు మాట్లాడుతూ మనం అంతరిక్షానికి దగ్గిరయినా, అంటరానితనానికి దూరం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలవారిది అత్యుత్తమ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ కుసుమ ధర్మన్న సాహితీస్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ మాట్లాడుతూ మను ధర్మ శాస్త్రానికి విరుగుడు కుసుమ ధర్మన్న సాహిత్యమని అన్నారు. 
     
    మధ్యందిన మార్తాండునిలా ధర్మన్న సాహిత్యం
    సుమారు ఏడు దశాబ్దాలు అజ్ఞాతంగా ఉన్న కుసుమ ధర్మన్న సాహిత్యం నేడు మధ్యందిన మార్తాండునిలా చీకట్లను చీల్చుకొని ఉదయిస్తోందని తెలుగు విశ్వవిద్యాలయం డీన్‌ ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ అన్నారు. ‘కుసుమ ధర్మన్న–సామాజిక సాహిత్య నేపథ్యం’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘మాలమాదిగలేకమైతే, లోకమంతా మారిపోదా’అని ఆనాడే ధర్మన్న పేర్కొన్నాడన్నారు.‘కంచం పొత్తు, మంచం పొత్తు’ ఉంటేనే అంతర్గత సమస్యలు మాసిపోతాయని కుసుమ ధర్మన్న భావించే వారన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ ఆదికవికి ముందున్న సోదికవులను మనం పట్టించు కోకపోవడం వలనే తెలుగు సాహిత్యం కేవలం వెయ్యేళ్లకే పరిమిత మయిందని కొందరు సిద్ధాంతాలు వల్లె వేస్తున్నారని అన్నారు. మహాకవి ఆరుద్ర రచించిన సమగ్రాంధ్రసాహిత్యంలో కూడా కుసుమ ధర్మన్నపై పరిశోధన కనపడదన్నారు. దానికి ఏ ఇజం అడ్డువచ్చిందో తెలియదన్నారు. సాహితీవేత్త శిఖామణి మాట్లాడుతూ కుసుమ ధర్మన్న రచించిన, ఆయనకు సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ ఆయన పాదాలకు తొడిగిన స్వర్ణకంకణమన్నారు. జీవీ రత్నాకర్, సన్నిధానం నరసింహశర్మ, కుసుమ రాజకుమారి, గూటంస్వామి, వేముల ఎల్లయ్య, శ్యాంషా తదితరులు కుసుమ ధర్మన్నకు నివాళులు అర్పించారు.
     
    ఘనంగా పుస్తకావిష్కరణలు 
    ప్రజాశక్తిబుక్‌హౌస్‌æ ప్రచురించిన కుసుమధర్మన్న రచించిన ‘మాకొద్దీనల్లదొరతనము’,‘హరిజనశతకం’, ‘సామ్యవాదాన్ని సహించని హిందుయిజం’,‘మద్యపాన నిషేధం’, వివిధ రచయితల వ్యాస సంకలనం ,  ‘తొలి దళిత స్ఫూర్తి కుసుమ ధర్మన్న, డాక్టర్‌ మద్దుకూరి సత్యనారాయణ రచించిన ‘కుసుమ ధర్మన్న రచనలు–దళితదృక్పథం’, డాక్టర్‌ పుట్ల హేమలత రచించిన ‘కుసుమ ధర్మన్న జీవిత ప్రస్థానం’ పుస్తకాలను కుసుమ ధర్మన్న కోడలు అమ్మాజీ, మనుమరాలు కుసుమ రాజకుమారి, మనుమడు ప్రసాద్‌ ఇతర అతిథులు ఆవిష్కరించారు. 
     
    అలరించిన గీతాలు
    ‘ధర్మన్నా! కుసుమ ధర్మన్నా! ధరాతలం«ధ్వనించే కవివన్నా!’ మొదలయిన గీతాలను సభప్రారంభం కావడానికి ముందు గాయకులు ఆలపించారు. కుసుమ ధర్మన్న చిత్రపటానికి ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement