అద్దె ఇళ్లల్లో అంగన్‌వాడీ కేంద్రాలు
–మునగాలలో 50కేంద్రాలకు 15మాత్రమే పక్కాభవనాలే
–ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, చిన్నారులు
మునగాల: మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహిస్తున్న పలు అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాలల్లోనే కొనసాగుతున్నాయి. సరిౖయెన వసతి సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీలు, సిబ్బంది నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 50అంగన్‌వాడీ కేంద్రాలుండగా వీటిలో కేవలం 15 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మండలంలోని ఆకుపామల, ముకుందాపురం, బరాఖత్‌గూడెం–1,2, గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, నారాయణగూడెం, మునగాల–1,3,4, తాడువాయి, వెంకట్రాంపురం, నేలమర్రి, విజయరాఘవపురం గ్రామాల్లోమాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దె ఇళ్లల్లో నడుస్తున్నాయి. ఇళ్లను అద్దెకు తీసుకోవడంతో సదరు ఇళ్లల్లో వసతి సౌకర్యాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. ఇదిలా ఉండగా మండల కేంద్రంలో బొడ్రాయి వద్ద 2014లో దాదాపు రూ.4లక్షల నిధులతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం భవనం నేటికి ప్రారంభం కాకపోడంతో నిరూపయోగంగా ఉంది. దీంతో పక్కనే ఉన్న ఓ వ్యాపారి ఈ భవనాన్ని స్టోర్‌రూంగా వాడుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన చిన్నారులు లేకపోవడంతో ఈ భవనం నేటికి నిరూపయోగంగా ఉంది. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ భవనాన్ని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకొని పలువురికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అంగన్ వాడీ కేంద్రానికి సొంత భవన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.