మా స్థలంలో అంగన్‌వాడీ భవనం నిర్మిస్తారా?
రాజమహేంద్రవరం రూరల్ : తమ స్థలంలో అంగన్‌వాడీ భవనం నిర్మించడం ఏమిటంటూ రాజమహేంద్రవరానికి చెందిన చేబోలు శ్రీలక్ష్మీభవాని అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తొర్రేడు గ్రామంలోని ఒకటో వార్డులో చెరువు స
అధికారుల వద్ద కన్నీటి పర్యంతమైన మహిళ
రాజమహేంద్రవరం రూరల్ : తమ స్థలంలో అంగన్‌వాడీ భవనం నిర్మించడం ఏమిటంటూ రాజమహేంద్రవరానికి చెందిన చేబోలు శ్రీలక్ష్మీభవాని అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తొర్రేడు గ్రామంలోని ఒకటో వార్డులో చెరువు సమీపంలోని గ్రామ కంఠభూమిలో అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి అధికారులు శంకుస్థాపన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి వస్తున్నట్టు తెలుసుకున్న శ్రీలక్ష్మీభవాని, ఆమె భర్త నారాయణ, తండ్రి దర్శిపూడి కృష్ణారావు అక్కడకు చేరుకున్నారు. ఇది తనకు పుసుపు కుంకుమగా ఇచ్చిన స్థలమని, అక్కడ అంగన్‌వాడీ భవనం ఎలా నిర్మిస్తారని శ్రీలక్ష్మీభవాని అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, కలెక్టర్, రాజానగరం ఐసీడీఎస్ సీడీపీఓలకు, పంచాయతీ కార్యదర్శికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ తతంగం తెలుసుకున్న ఎమ్మెల్యే గోరంట్ల అక్కడకు రాకుండా వెనుదిరిగారు. శంకుస్థాపనకు వచ్చిన తహసీల్దార్ భీమారావు, ఎంపీడీఓ ఎ.రమణారెడ్డికి శ్రీలక్ష్మీభవానీ మొరపెట్టుకుంది. కాగా స్థానిక టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని.. ఇది గ్రామకంఠానికి చెందిన పోరంబోకు భూమి అని, అంగన్‌వాడీ భవనం నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఒక దశలో ఇరువర్గాల వాగ్వాదం జరిగింది. గ్రామ ఆడపడుచు ఉసురు తగులుతుందంటూ శ్రీలక్ష్మీభవాని కన్నీంటిపర్యంతమైంది. తుదకు తహసీల్దార్ భీమారావు మాట్లాడుతూ ప్రస్తుతం శంకుస్థాపన మాత్రమే చేస్తున్నామని, అనంతరం కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని వివరించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా టీడీపీ నేతలు అత్యుత్సాహంతో శంకుస్థాపన ఫలకాన్ని రోడ్డుపైనే ఏర్పాటు చేశారు.