త్వరలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ
రాయదుర్గం రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 200 హెల్పర్, 25 అంగన్‌వాడీ వర్కర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జుబేదాబేగం వెల్లడించారు. మండలపరిషత్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 5,126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా అందులో 1200 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఉపాధి హామీ నిధులతో 881 కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని తలపెట్టగా 419 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. 100 సూపర్ వైజర్ల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉందన్నారు. చిన్నసైజులోని కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయని విలేకరులు ప్రశ్నించగా.. వచ్చే నెల నుంచి పౌల్ట్రీ ఫాం నుంచి నేరుగా నిర్ణీత పరిమాణం గల కోడిగుడ్లు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. జూలై నుంచి పిల్లలకు, బాలింతలకు పాలు అందడం లేదని ప్రస్తావించగా.. ఏజెన్సీవారు పాల సరఫరా నిలిపివేసిన కారణంగా ఇవ్వలేకపోయామన్నారు. త్వరలోనే పాల సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ సరోజమ్మ, ఎంపీడీఓ శ్రీనివాసులు, సూపర్‌వైజర్ లీలాపద్మావతి పాల్గొన్నారు.