► ఆనందంలో అంగన్ వాడీ టీచర్లు, సహాయకులు
► వేతనం పెంపుతో జిల్లాలో 2,900 మందికి లబ్ధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అంగన్ వాడీ టీచర్లు, సహాయకుల శ్రమకు గౌరవం లభించింది. ఏళ్లుగా అన్నీ తామై చేస్తున్న సేవలకుగాను ఫలితం దక్కింది. వీరు ప్రస్తుతం అందుకుంటున్న గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు సీఎం కె. చంద్రశేఖరరావు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 1,500 మంది అంగన్వాడీ టీచర్లకు, 1,400 మంది సహాయకులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ప్రతి నెలా టీచర్లకు రూ. 7 వేలు, సహాయకులకు రూ. 4,500 గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తోంది. టీచర్లకు రూ. 10,500, సహాయకులకు రూ. 6 వేలకు పెంచుతూ సీఎం ప్రకటించడంతో వారి మోముల్లో ఆనందం తొణికిసలాడు తోంది. తాము చేస్తున్న పనులకు.. పొందుతున్న గౌరవ వేతనానికి ఏ మాత్రం పొంతన లేదని వారు గతంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.
సేవలు ఇవే...
అంగన్ వాడీల్లో నమోదైన పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా బోధన, పౌష్టికాహారం అందజేత, మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు స్నాక్స్ వండి వడ్డించడం, గర్భిణీలకు ఒకపూట భోజనం పెట్టడం వంటి పనులు చేస్తున్నారు. వీటితోపాటు ఆరోగ్య సంబంధమైన బాధ్యతలను వీరికే అప్పగిస్తున్నారు. ఇవే కాదు.. ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టినా వీరి సహాయం లేకుండా అమలు సాధ్యంకాని పరిస్థితి. చివరకు సర్వేలకు సైతం వీరి సేవల్ని వినియోగించుకున్న దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా అంగన్ వాడీల పనివేళల్ని పెంచినప్పటి నుంచి వీరికి ఎనలేని బాధ్యతలు సంక్రమించాయి. అలాగే పనిభారం కూడా రెట్టింపయ్యింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్ వాడీలకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలను శిరసా వహిస్తూ పనిచేసూ్తనే.. మరోవైపు తమ దీనస్థితిపై ఎలుగెత్తారు. వీరి ఆవేదనను ఆలకించిన ప్రభుత్వం..గౌరవ వేతనం పెంచుతామని ప్రకటించడంతో అంగన్ వాడీ లోకమంతా ఆనందాల్లో మునిగిపోయింది. తాము ఇకపై మరింత ఉత్సాహంతో సేవలందిస్తామని చెబుతున్నారు. అంతేగాక బీమా సౌకర్యం కల్పిస్తామనడంపైనా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జిల్లాలో 1600 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిలో దాదాపు వంది టీచర్ల పోస్టులు, రెండు వందల సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా త్వరలో భర్తీచేస్తామని చెప్పడం ద్వారా ఆశావహ అభ్యర్థుల్లోనూ ఉత్సాహం మొదలైంది.
శ్రమకు దక్కిన గౌరవం
Published Wed, Mar 1 2017 3:45 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM
Advertisement