పశువుల్లో గర్భకోశ వ్యాధులు.. నివారణ | animals disease.. prevention | Sakshi
Sakshi News home page

పశువుల్లో గర్భకోశ వ్యాధులు.. నివారణ

Published Sun, Jul 17 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

animals disease.. prevention

 జంగారెడ్డిగూడెం:  పశువులు ఆరోగ్యవంతంగా ఉండి సరైన సమయంలో ఎదకు వస్తే పశు సంపద పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పశువులు తక్కువ వయసులో తొలి ఎదకు వచ్చి ఈనితే రైతుకు లాభం. దేశవాళీ పశువులు ఆలస్యంగా, విదేశీ పశువులు చాలాతక్కువ వయసులో తొలి ఎదకు వస్తాయి. పశువులు ఎదకు వచ్చే సమయం, పశువుల గర్భకోశ, జననేంద్రియ వ్యాధులు, నివారణ తదితర విషయాలను జంగారెడ్డిగూడెం పశువైద్యాధికారి బీఆర్‌ శ్రీనివాసన్‌ మాటల్లోనే..
పశువులు తొలి ఎదకు వచ్చినప్పుడు అవి యుక్త వయసుకు వచ్చినట్టు అర్థం. పశువు ఆరోగ్యంగా, బలంగా ఉంటే సహజ సంపర్కం అంటే గిత్తను దాటించడం లేదా ఇన్‌సిమినేషన్‌ చేయవచ్చు.
పశువుల్లో రుతుచక్రం ఇలా.. ఆరోగ్యమైన పశువులు తొలి ఎదకు వచ్చినప్పటి నుంచి ప్రతి 3 వారాలకు సుమారు 21 రోజులకు ఒకసారి ఎదకు వస్తుంది. కొన్ని పశువులు 21 రోజుల కంటే 4, 5 రోజులు అటూ ఇటుగా వస్తాయి. అంటే ఎదకు సుమారు 18 నుంచి 24 రోజులు ఉంటుంది. ఒకవేళ ఆ ఎదలో గర్భం ధరించకపోతే తిరిగి 21 రోజులకు ఎదకు వస్తుంది. గర్భం ధరిస్తే ఎదకు రాదు. సాధారణంగా దేశీయ ఆవుదూడలు 4 సంవత్సరాల వయసులో యుక్తవయసుకు వస్తాయి. ఒంగోలు జాతి దూడలు మూడు సంవత్సరాలకు, సంకర జాతి పశువులు సంవత్సరానికి యుక్త వయసుకు వస్తాయి. నాటు గేదెలు వంటివి 4 సంవత్సరాలకు, ముర్రా జాతిగేదెలు 3 సంవత్సరాల వయసులో మొదట ఎదకు వస్తాయి. ఈ మొదటి ఎదకు రావటాన్ని జాతి లక్షణాలు, దాని బరువు, పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. సరైన పోషణ లేని పశువులు సాధారణంగా ఎదకు రావాల్సిన సమయంలో ఎదకు రావు. లేదా ఈనిన తరువాత తిరిగి ఎదకు తొందరగా రావు. ఒకవేళ పశువు సరైన ఎదుగుదల ఉండి వయసుకు వచ్చినా కూడా ఎదకు రాకపోతే వైద్యం చేయించడం అవసరం.
గర్భకోశం ఎదగకపోవడం వల్ల కూడా.. కొన్ని పశువుల్లో మొదటి ఎద వయసు వచ్చినా సరే ఎదకు రాకుండా ఉంటాయి. దీనికి గర్భకోసం ఎదగకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. పశువులు ఎదకు రాకపోతే వైద్యులకు చూపించి గర్భకోశం ఎదుగుదల పరీక్షించి తగిన చికిత్సలు చేయించాలి.
గర్భస్రావాలు .. కొన్ని పశువులు నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చూడు గర్భస్రావాలు జరుగుతాయి. దీనికి గర్భకోశ వ్యాధులు కారణం కావచ్చు. 3 నెలల గర్భం ప్రతిసారి పోతుంటే వైద్యునికి చూపించాలి. ట్రైకోమనియోసిస్‌ అనే వ్యాధి వల్ల ఇలా గర్భం నిలవకపోవడం జరుగుతుంది. 6 నెలలు గర్భం స్రావం బ్రూసిల్లోసిస్‌ అనే వ్యాధి వల్ల జరిగే అవకాశం ఉంది. ఇవి రెండూ అంటువ్యాధులే. పశువులు ఈనిన తరువాత 3 నుంచి 24 గంటల్లోపు మాయ వేయకపోతే తప్పనిసరిగా చికిత్స చేయించాలి.
గర్భకోశం, యోని దిగజారుట .. కొన్ని పశువులు ఈనిన తరువాత యోని, గర్భకోశం బయటకు వస్తాయి. లిగమెంట్లు వదులు కావడం వల్ల అవి గర్భకోశాన్ని, యోనిని గట్టిగా తన స్థానంలో ఉండేట్టుగా బంధించి ఉంచలేవు. కొన్ని పశువులు ఈనక ముందే యోని బయటకు వస్తుంది. దీనికి ముందు జాగ్రత్తగా పశువుకు కడుపునిండా నీరు ఒక సారే పెట్టకూడదు. కొంచెం, కొంచెం చొప్పున ఎన్నిసార్లు అయినా పెట్టవచ్చు. అలానే పశువు పడుకోకుండా చూడాలి. ఈనిన పశువుకు గర్భకోశం బయటకు వచ్చినటై్టతే దానిని శుభ్రంగా చల్లటి నీళ్లతో సబ్బుతో కడిగి లోపలకు నెట్టాలి. అవసరమైతే మానం పెదవులు రెండూ కుట్టివేయాలి. సాధ్యమైనంత వరకు పడుకోనివ్వరాదు. ఈనక ముందు బయటకు వచ్చినా ఇదేవిధంగా చేయాలి.
ఎండోమైట్రైసిస్‌ ..గర్భకోశ వ్యాధులలో ఇది ముఖ్యమైనది. ఈ వ్యాధి ఉన్న పశువులు త్వరగా ఎదకు రావు. తొందరగా కట్టకుండా తిరిగి తిరిగి ఎదుకు వస్తాయి. గర్భకోశం నుంచి చీములాగా స్రావం వస్తుంది. 
గర్భాశయద్వారపు వాపులు(సర్వీసైటిస్‌) .. సాధారణంగా పశువు చూడికట్టగానే గర్భాశయ ద్వారం మూసుకుపోతుంది. తిరిగి గేదె ఈనె సమయంలో తెరుచుకుంటుంది. ఈ వ్యాధిలో గర్భాశయ ద్వారం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. దీనివల్ల పశువు చూడికట్టుట, చూడి నిలబడటం కష్టం. ఈ వ్యాధిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనబడవు. పరీక్ష చేస్తే తెలుస్తుంది. ఎప్పుడూ తిరుగ కట్టే పశువుల్లో ఈ వ్యాధి ఒక కారణం  
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement