సత్తెన్న ‘ హుండీ ’ సిరి రూ.1.25 కోట్లు
అన్నవరం: శ్రీ సత్యదేవునికి మే నెలలో 27 రోజులకు హుండీల ద్వారా రూ.1,25,18,846 ఆదాయం సమకూరింది. అన్నవరం దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. రూ.1,16,37,156 నగదు, రూ.8,81,690 చిల్లర నాణాలు వచ్చినట్టు హుండీ లెక్కింపు పర్యవేక్షించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో 200 గ్రాముల బంగారం, 145 గ్రాముల వెండి భక్తులు సమర్పించారన్నారు. వీటితో బాటు అమెరికా డాలర్లు 144, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు పది, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ దీర్హామ్ ఒకటి, సింగపూర్ డాలర్లు 12, మలేషియా డాలర్లు తొమ్మిది, కెనడా డాలర్లు 20, మరో ఐదు దేశాలకు చెందిన కరెన్సీ లభ్యమయ్యాయని తెలిపారు. వేసవి సెలవుల కారణంగా నెల్లాళ్లుగా సత్యదేవుని ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు. దీనికి తోడు పెద్దసంఖ్యలో వివాహాలు జరగడం, స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు తదితర కార్యక్రమాలను తిలకించడానికి వచ్చిన భక్తులు హుండీలో దండిగా కానుకలు సమర్పించడంతో ఈ ఆదాయం లభించిందన్నారు.
ఆదాయంలో రూ.వంద, రూ.పదులదే అగ్రస్థానం:
సత్యదేవుని హుండీ ఆదాయంలో సగానికన్నా ఎక్కువగా రూ.వంద, రూ.పది నోట్లే ఉన్నాయి. రూ. 2 వేల నోట్లు 556, రూ. 500 నోట్లు 3,646, రూ. 100 నోట్లు 46,700, రూ. 50 నోట్లు 22,772, రూ. 20 నోట్లు 40,867, రూ. పది నోట్లు 2,06,431, రూ. 5 నోట్లు 2,343, రూ. 2 నోట్లు 15, రూ. 1 నోట్లు 161 ఉన్నాయి. చిల్లర రూ. 8,81,690 సమకూరింది.