కోటీశ్వరుడు ... సత్య గిరీశుడు
కోటీశ్వరుడు ... సత్య గిరీశుడు
Published Fri, Jun 30 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM
- హుండీలు తెరిస్తే చాలు...‘రూ కోటి ’ ఆదాయం వచ్చినట్టే !
- వరుసగా మూడు నెలలు రూ.కోటి దాటిన సత్యదేవుని హుండీ ఆదాయం
- జూన్ నెల హుండీ ఆదాయం రూ.1,23,71,212
అన్నవరం: (ప్రత్తిపాడు): రత్నగిరివాసుడు శ్రీ సత్యదేవుని ఆలయానికి ఆదాయం గణనీయంగా వస్తోంది. అందులో హుండీల ద్వారా వచ్చే ఆదాయమే ప్రతి నెలా రూ.కోటికి పైగా ఉంటోంది. సంవత్సరంలో ఒకటి, రెండు నెలలు మినహా ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.కోటి దాటుతోంది. జూన్ నెలకుగాను శుక్రవారం సత్యదేవుని హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,23,71,212 ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నెలకు సంబంధించి హుండీలను మే రెండో తేదీన (32 రోజులకు) తెరిచి లెక్కించగా రూ.1.08 కోట్లు ఆదాయం వచ్చింది. మే నెలకు సంబంధించి అదే నెల 29న లెక్కించగా రూ.1.25 కోట్లు ఆదాయం వచ్చింది.
వేసవి సెలవులు...వివాహాల సీజన్‌తో...
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో స్వామి సన్నిధిన వివాహాలు అధికంగా జరగడం, వేసవి సెలవులు, సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు తదితర కారణాలతో స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో స్వామివారికి ఆదాయం భారీగా వచ్చింది. దాంతోపాటే హుండీల్లో కూడా భక్తులు దండిగా కానుకలు సమర్పించడంతో ఆదాయం రూ.కోటి దాటిందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
హుండీ ఆదాయంలో నగదు 1.15 కోట్లు, చిల్లర రూ.8.15 లక్షలు...
శుక్రవారం స్వామివారి హుండీలను తెరిచి లెక్కించగా రూ.1,23,71,212 ఆదాయం వచ్చిందని ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు తెలిపారు. ఇందులో రూ.1,15,55,412 నగదు కాగా, రూ.8,15,800 చిల్లర నాణేలు. వీటితోపాటు బంగారం 65 గ్రాములు, వెండి 870 గ్రాములు లభించాయని తెలిపారు. అమెరికా డాలర్లు 719, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 205 , సింగపూర్ డాలర్లు రెండు, మలేషియా రిమ్స్ మూడు. మరో నాలుగు దేశాల కరెన్సీలు లభించాయని తెలిపారు.
ఇంకా హుండీలలో రద్దయిన నోట్లు...
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను భక్తులు ఇంకా హుండీల్లో వేస్తూనే ఉన్నారు. శుక్రవారం స్వామివారి హుండీలను తెరవగా రూ.1,04,000 విలువైన పాత నోట్లు లభించాయి.
హుండీలో రూ.500 నకిలీ నోటు...
అప్పుడే కొత్త రూ.500 నకిలీ నోట్లు తయారయ్యాయి. ఇందుకు సాక్ష్యమే ఇది. ఈ నకిలీ నోటు ఒకటి శుక్రవారం దేవస్థానం హుండీలలో రాగా లెక్కింపులో సిబ్బంది గుర్తించి చించేశారు. శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పాలకమండలి సభ్యులు పర్వత రాజబాబు, యడ్ల భేతాళుడు, కొత్త వేంకటేశ్వరరావు (కొండబాబు), రొబ్బి విజయశేఖర్, శింగిలిదేవి సత్తిరాజు, యనమల రాజేశ్వరరావు పర్యవేక్షించారు. దేవస్థానం సిబ్బంది, వ్రతపురోహితులు, నాయీ బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement