కాసుల వర్షం
అన్నవరం :
సత్యదేవుని సన్నిధిలో కాసుల వర్షం కురిసింది. దండిగా ఆదాయం వచ్చింది. ఆగస్టు నెలకు సంబంధించి అన్నవరం దేవస్థానానికి స్వామివారి హుండీల ద్వారా రూ.1,04,38,186 రాబడి సమకూరింది. స్వామివారి హుండీలను మంగళవారం తెరచి లెక్కించారు. హుండీల ద్వారా నగదు రూపంలో రూ.98,98,676, చిల్లర నాణేల రూపంలో రూ.5,39,510 ఆదాయం వచ్చినట్టు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. వీటితోపాటు వంద గ్రాముల బంగారం, 680 గ్రాముల వెండి లభించిందన్నారు. అలాగే మొత్తం 17 దేశాల కరెన్సీ కూడా ఉందని చెప్పారు. అమెరికన్ డాలర్లు 125, యూఏఈ 170, ఖతార్ సెంట్రల్ బ్యాంకు రియాల్స్ 139, సింగపూర్ డాలర్లు 32, మలేషియా డాలర్లు 46, కెనడా డాలర్లు 20, ఇంగ్లండ్ పౌండ్స్ 65 లభించాయని తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ఏసీ జగన్నాథరావు, సిబ్బంది పాల్గొన్నారు.