మన్యంలో మావోల వార్షికోత్సవ పోస్టర్లు
చింతూరు (రంపచోడవరం) : నక్సల్బరీ 50వ వార్షికోత్సవాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహించాలంటూ చింతూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు శబరి, చర్ల ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్లు వెలువడ్డాయి. పెట్టుబడీదారి వ్యవస్థను భూమట్టం చేయాలని, ప్రజారాజ్యాధికారానికి పోరాడాలని పోస్టర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు. మిషన్ 2017ను ఓడిద్దామని, ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలపై యుద్ధాన్ని తిప్పికొడదామని పోస్టర్లలో తెలిపారు. జాతీయ రహదారిపై పోస్టర్లు వెలువడడంతో ఏజన్సీ ప్రాంతంలో కలకలం రేగింది. ఇటీవలే సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వెలువడడం చర్చనీయాంశమైంది.
ఏం సాధించారని ఉత్సవాలు
మావోయిస్టులు ఏం సాధించారని 50 ఏళ్ల ఉత్సవాలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని చింతూరు ఓఎస్డీ డాక్టర్ కె.ఫకీరప్ప ప్రశ్నించారు. మావోయిస్టుల పోస్టర్లపై స్పందించిన ఆయన మాట్లాడుతూ గిరిజనులను అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచుతూ పబ్బం గడుపుకుంటున్నందుకా, విద్య అందకుండా నిరక్షరాస్యులుగా వుంచుతున్నందుకా సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. చిన్నపాటి రోగాలకు సైతం వైద్యం అందకుండా గిరిజనులు చనిపోయే పరిస్థితులు తెస్తున్నందుకా, అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్నందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతున్న ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తూ అంధకారంలోకి నెట్టేస్తున్నందుకా, ప్రజల రక్షణ కోసం కుటుంబాలను వదిలి విధులు నిర్వహిస్తున్న వేలాది ప్రభుత్వ అధికారులను పొట్టన పెట్టుకున్నందుకు ఈ ఉత్సవాలు నిర్వాహిస్తున్నారా అంటూ ఓఎస్డీ ప్రశ్నించారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
నెల్లిపాక (రంపచోడవరం): మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం ఎటపాక మండలంలో ఫ్లెక్సీలు వెలిశాయి. నెల్లిపాక , ఎటపాక ప్రదాన సెంటర్లలో వీటిని ఆదివాసీ సంఘం పేరుతో ఏర్పాటు చేశారు. నక్సల్స్ బరి 50వ వార్షికోత్సంవ సంబరాలను వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు మావోయిస్టులు పాల్పడిన దుర్మార్గాలను వివరిస్తూ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. ప్రదాన సెంటర్లలో ఈ ఫ్లెక్సీలు వెలియడంతో ప్రజలు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.