వసతులు కల్పిస్తే నాణ్యమైన విద్య
-
జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను ఆశించాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. స్థానిక కస్తూరిదేవి గార్డెన్‌లో బుధవారం సెకండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హెచ్‌ఎంలు, ఎంఈఓల వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతి«థిగా హాజరైన బొమ్మిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యకు కేవలం రూ.15 వేల కోట్లు కేటాయిస్తోందని, వాటిలో రూ.10వేల కోట్లు వేతనాలకు, మరో రూ.3 వేల కోట్లు మధ్యాహ్న భోజనానికి వెచ్చిస్తున్నారన్నారు. మిగిలిన మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువుగా పేద విద్యార్థులు చదువుతున్నారని, పీజీ వరకు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా వాచ్‌మెన్ లేడని, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. జిల్లాలో కోటి మొక్కలు నాటామని చెబుతున్నా వాటిలో ఎన్నింటిని బతికించారో ఆలోచించాలన్నారు. పాఠశాలల్లో మొక్కకు రూ.7.50లు, మెయింటెనెన్స్‌కు రూ.13లు ఇస్తారన్నారు. ఈ డబ్బులతో వాచ్‌మెన్‌ను నియమించుకోవచ్చని సూచించారు. జిల్లా పరిషత్ నిధుల్లో విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మేయర్ అజీజ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో విద్యార్థులు రాణించేందుకు 6వ తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తున్నామన్నారు. జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఈఓ రామలింగం, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయుకులు వెన్నపూస బ్రహ్మారెడ్డి, ఐఐటీ ఫౌండేషన్ కోర్సు కోఆర్డినేటర్ డా.వెంకటేశ్వరరావులు మాట్లాడారు. సమావేశంలో కార్పొరేటర్ రాజేష్, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, ప్రధానాచార్యులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.