‘స్వచ్ఛ’పేట!
♦ సిద్దిపేట సిగలో త్వరలో మరో మణిహారం
♦ ‘స్వచ్ఛ భారత్’ జాబితాలో చోటు
♦ పట్టణంలో అస్కీ బృందం పర్యటన
♦ వాస్తవ పరిస్థితులపై ఆరా
♦ రోజంతా పరిశీలనలు
సిద్దిపేట జోన్: ఇప్పటికే జాతీయ స్థాయిలో మూడు అవార్డులను మూటగట్టుకున్న సిద్దిపేట.. మరో అవార్డును సొంతం చేసుకోనుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ పట్టణం జాబితా షార్ట్ లిస్టులో సిద్దిపేటకు స్థానం దక్కింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో స్వచ్ఛ బాట సఫలమైంది. ‘స్వచ్ఛ భారత్’ అవార్డను అందుకునేందుకు మున్సిపల్ సిద్ధమైంది. ఇక్కడ అమలవుతున్న విధానాలను వివిధ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం.
దేశవ్యాప్తంగా 20 పట్టణాల నుంచి 350 దరఖాస్తులను స్వీకరించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ దశల్లో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి షార్ట్ లీస్ట్ కింది 70 దరఖాస్తులను ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణ నుంచి 8 దరఖాస్తులు రావడం.. అందులో సిద్దిపేట మున్సిపాలిటీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను కేంద్రం ఎంపిక చేసింది. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి అస్కీ (అడ్మినిష్ట్రేషన్ స్టాప్ కాలేజీ ఆఫ్ ఇండియా) బృందాన్ని సిద్దిపేటకు పంపింది. ప్రొఫెసర్ రవీంద్రప్రసాద్ నేతృత్వంలోని బృందం సభ్యులు బాలసుబ్రమణ్యం, తార రావు, గౌతమిలు గురువారం సిద్దిపేటకు చేరుకున్నారు.
ముందుగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం సమావేశ మందిరంలో మున్సిపల్‌కు చెందిన వివిధ విభాగాల అధికారులు, మెప్మా, మురికి వాడల అభివృద్ధి కమిటీ, ఐటీసీ సంస్థ ప్రతినిధులచే సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. సిద్దిపేట పట్టణంలో అర్బన్ డెవలప్‌మెంట్ కింద చేపడుతున్న వినూత్న పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగితెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సిద్దిపేటలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియపై ఆరా తీశారు. శానిటేషన్, మెప్మా, సమాఖ్య సంఘాల ప్రతినిధుల నుంచి పలు అంశాలను అడిగితెలుసుకున్నారు. బహిరంగ మలవిసర్జన లేని పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దడానికి చేపట్టిన అంశాలను మున్సిపల్ కమిషనర్ రమణాచారి, చైర్మన్ రాజనర్సు, ఓఎస్డీ బాల్‌రాజు ద్వారా అడిగి తెలుసుకున్నారు.
పందులు లేని పట్టణం
సిద్దిపేటలో పందులను తరలించి పారిశుద్ధ్యాన్ని గాడిన పెట్టామని మున్సిపల్ కమిషనర్ రమణాచారి కేంద్ర బృందానికి వివరించారు. అధికారుల వివరణతో ఆశ్చర్యానికి లోనైన బృందం చీఫ్ రవీంద్రప్రసాద్.. మరింత ఆసక్తిగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఎలా సాధ్యమైందంటూ అని అడిగారు. 30 సంవత్సరాలుగా ఈ ప్రక్రియను ఎందుకు నిర్వహించలేదని బృందం సిద్దిపేట అధికారులను ప్రశ్నించింది. ఒక దశలో కమిషనర్ జోక్యం చేసుకొని అప్పట్లో ఐఎస్‌ఎల్ నిర్మాణ పథకంపై పూర్తిస్థాయిలోప్రచారం, సరైన పారితోషకం, అనుకూలమైన విధానాలు లేకపోవడం వల్లే పూర్తి స్థాయిలో సాధ్యకాలేదన్నారు.
అనంతరం వాటర్ సరఫరా, ఇంటింటి చెత్త సేకరణ, మురికి కాలువల శుద్ధీకరణ, తడి, పొడి చెత్త సేకరణతో పాటు ఇతర అంశాలపై బృందం సభ్యులు గంటల కొద్ది సమీక్షించారు. అంతకు ముందు ఐటీసీ అధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ ద్వారా సిద్దిపేటలో వావ్ పథకం కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మేంట్ ఇంటింట తడి పొడి చెత్త సేకరణ, వేరు చేసే ప్రక్రియను, తదితర అంశాలను బృందం తిలకించింది. అనంతరం కాళ్లకుంట కాలనీ, గాడిచెర్లపల్లితోపాటు, మందపల్లి డంప్‌యార్డు, ఐటీసీ హబ్, పట్టణంలోని సులభ్ కాంప్లెక్స్‌లను , మురికి కాలువలను బృందం పరిశీలింది. వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్‌పటేల్, మున్సిపల్ అధికారులు లక్ష్మణ్, ఏఈ ఇంత్యాస్, శానీటరీ ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డి, సత్యనారాయణ, టీపీఓ రాంరెడ్డి, మెప్మా ప్రతినిధి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.