నేనింతే!
కురుగొండ్ల మరో వివాదం
- ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే కండలేరు గేట్లు ఎత్తివేత
- అధికారుల అత్యవసర సమావేశం నీటి విడుదల నిలిపివేత
- ఈ ఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలకు ఆదేశం
- ఎమ్మెల్యే తీరుపై అధికారుల ఆందోళన
- మంత్రి నారాయణ జోక్యంతో సోమవారం సాయంత్రం నీటి విడుదల
సాక్షి ప్రతినిధి - నెల్లూరు: తరచూ వివాదాల్లో ఉండే వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ తన సహజ ధోరణి కారణంగా ఆదివారం మరో వివాదానికి తెర లేపారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు లేకుండానే కండలేరు జలాశయం నుంచి సారుుగంగ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు సీరియస్ అయ్యారు. రిజర్వాయర్ ఈఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
వెంటకగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని తెలుగుగంగ కాలువల కింద రైతులు సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వర్షాలు వస్తాయనే ఆశతో ఇంతకాలం ఎదురు చూసిన రైతులు తమ పంటల ప్రాణాలు కాపాడు కోవడానికి కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కండలేరు జలాశయంలోని నీరు తాగునీటి అవసరాలకే సరిపోని పరిస్థితులు ఉన్నందు వల్ల సాగుకు ఇవ్వలేమని జిల్లా ప్రజాప్రతినిధులతో ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. రైతులు పంటలు వేయకుండా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. రైతులు మాత్రం తాము సాగు చేసిన పంటలను బతికించుకోవడానికి కండలేరు జలాశయం నుంచి నీటిని ఇవ్వాల్సిందేననే డిమాండ్ మరింత పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రైతుల పక్షాన ఆందోళనకు దిగారు. 10వ తేదీలోగా సాగునీరు విడుదల చేయక పోతే 11వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
ఆగమేఘాలపై రంగంలోకి.
రైతుల ఆందోళనలను సీరియస్‌గా తీసుకోని ఎమ్మెల్యే రామకృష్ణ, ఈఈ మీద చర్యలకు ఆదేశం ఎమ్మెల్యే నేరుగా వెళ్లి డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినా ఎందుకు తెలుసుకోలేక పోయారనే కారణంపై కండలేరు జలాశయం ఈఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ ఎస్‌ఈని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే అత్యుత్సాహం తమ తలకు తెచ్చిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
జెడ్‌పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆమరణ దీక్ష ప్రకటనతో ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. బొమ్మిరెడ్డి ఆమరణ దీక్షకు దిగితే రైతులు రోడ్డెక్కుతారని, రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయంతో ఆదివారం నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ, మంత్రి నారాయణతో ఫోన్‌లో మాట్లాడి కండలేరు నుంచి నీటి విడుదలకు సరేననిపించారు. మంత్రుల మౌఖిక అంగీకారంతో రామకృష్ణ నేరుగా కండలేరు డ్యాం వద్దకు వెళ్లి సంబంధిత అధికారులెవరూ లేకుండానే గేట్లకు సంబంధించిన స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఎమ్మెల్యే నీరు విడుదల చేయడంపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందారు. ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమై విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో నీటి విడుదలను ఆపివేశారు.
రామకృష్ణ చర్యలపై మంత్రి అసహనం
కండలేరు నుంచి పంట సాగుకు నీటిని విడుదల చేరుుస్తానని తాను చెప్పడంతోనే ఎమ్మెల్యే రామకృష్ణ నేరుగా డ్యాం దగ్గరకు వెళ్లి గేట్లు ఎత్తేయడం పట్ల మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. సోమవారం ఆయన కలెక్టర్ ముత్యాలరాజు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి పంట సాగుకు నీరు విడుదల చేయడానికి అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశంతో ఇరిగేషన్ అధికారులు సోమవారం సాయంత్రం మరోసారి నీటిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణరుుంచారు. ఈ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగానే చేరుుంచారు.