మరో రెండు ఏకగ్రీవాలు
♦ టీఆర్‌ఎస్ ఖాతాలోకి ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానాలు
♦ నామినేషన్లు ఉపసంహరించుకున్న ప్రతిపక్ష అభ్యర్థులు
♦ ఆదిలాబాద్‌లో గులాబీ గూటికి చేరిన టీడీపీ అభ్యర్థి
♦ మెదక్‌లో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
ఆదిలాబాద్ టౌన్/సంగారెడ్డి/ఇందూరు: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ రెండూ అధికార పార్టీ ఖాతాలోకే చేరాయి. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పురాణం సతీశ్ ఎన్నిక ఖాయమైంది. ఈ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రియాజుద్దీన్ శుక్రవారం బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీ ఫలితాలను శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. టీడీపీ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థి నారాయణరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఇక సీఎం సొంత జిల్లా మెదక్‌లో ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో ఎమ్మెల్సీగా ఆయన మూడోసారి మండలిలో అడుగు పెట్టనున్నారు. ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్‌పాటిల్, టీడీపీ అభ్యర్థి కొన్యాల బాల్‌రెడ్డి తప్పుకోవడంతో భూపాల్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. శివరాజ్‌పాటిల్‌ను హైదరాబాద్ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తమ వెంట తీసుకువచ్చారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీయాదవ్... శివరాజ్‌పాటిల్ నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూశారు. పాటిల్‌ను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నట్లు ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి తెలిపారు. సీఎం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు శివరాజ్‌పాటిల్ తెలిపారు. కాగా, మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడి బరిలో నుంచి తప్పుకునేలా చేసినట్లు సమాచారం.
నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అటు ఎంపీటీసీల ఫోరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో ఉన్న జగదీశ్‌ను కూడా టీఆర్‌ఎస్ వర్గాలు సీఎం క్యాంపు కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. శనివారం జగదీశ్ నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీగా బరిలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపతి రెడ్డి ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయినట్లే. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ వెనుక మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.