నాక్ బృందం ఏఎన్‌యూ సందర్శన
నాక్ బృందం ఏఎన్‌యూ సందర్శన
Published Mon, Dec 5 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
* ఏఎన్‌యూ అభివృద్ధిపై వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
* అనంతరం విభాగాలను సందర్శించిన బృందం
* కీలక అంశాలను లేవనెత్తిన సభ్యులు
* కొన్ని చోట్ల తడబడిన విభాగాధిపతులు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాక్( నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్ ) నిపుణుల బృందం పర్యటన సోమవారం ప్రారంభమయ్యింది. కమిటీలో తొమ్మిది మంది ఉండగా ప్రొఫెసర్ సి బసవరాజు తొలిరోజు పర్యటనకు రాలేదు. నాక్ బృందానికి యూనివర్సిటీ పరిపాలనా భవన్ వద్ద ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్‌ను నాక్ బృందం స్వీకరించింది. నాక్ నిపుణుల బృందానికి వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ గత ఐదేళ్లలో యూనివర్సిటీ సాధించిన సమగ్రాభివృద్ధితో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను సమర్పించారు. వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సుదీర్ఘంగా రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను వీక్షిస్తున్న సమయంలో నాక్ బృందం యూనివర్సిటీలో భవిష్యత్‌లో చేపట్టబోయే చర్యలు ఏంటి, పరిశ్రమలతో కలిసి యూనివర్సిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది.. అనే అంశాలను వీసీని అడిగారు. వీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ఏఎన్‌యూ ఐక్యూఏసీ( ఇంటర్నల్ క్వాలిటీ ఎస్సూరెన్స్ సెల్ ) ప్రజెంటేషన్‌ను కోఆర్డినేటర్ ఆచార్య కె రత్నషీలామణి సమర్పించారు. అనంతరం నిపుణుల బృందం చైర్‌పర్సన్ ఆచార్య హెచ్‌పీ ఖించా, ఆచార్య టి శ్రీనివాస్, ఆచార్య రాజేంద్రసింగ్‌లు ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలను సందర్శించి విద్య, పరిశోధన, బోధన, పరిశోధనా ప్రాజెక్టులు, ఇస్రో అనుబంధంతో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించారు. ఆచార్య టీఎన్ మాథూర్, ఆచార్య అరుణ్‌కుమార్, ఆచార్య వసంత్ జుగాలేలు ఆర్ట్స్, కామర్స్ కళాశాలలోని పలు విభాగాలను సందర్శించారు. ఆచార్య ఎన్‌పీ శుక్లా, ఆచార్య విజయ్ జుయాల్‌లు యూనివర్సిటీ సైన్స్ కళాశాలలోని పలు విభాగాలతో పాటు ఆర్ట్స్, లా కళాశాలల్లోని జర్నలిజం, లా విభాగాలను సందర్శించారు.
కీలక అంశాలను లేవనెత్తిన సభ్యులు..
విభాగాల సందర్శన, విభాగాధిపతుల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా నాక్ నిపుణులు పలు కీలక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి ఎంత, అధ్యాపకుల కొరత ఎందుకు ఉంది, వృత్తివిద్యా కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఎందుకు లేరు.. విద్యార్థులకు నైపుణ్య లక్షణాలు, ఉపాధి కల్పన పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలేంటి..? విభాగాల ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్యలేంటి..?, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రణాళిక ఏంటి, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కొలాబ్రేషన్స్ ఎలా ఉన్నాయి.. తదితర అంశాలను నిపుణుల బృందం అడిగి విభాగాధిపతులు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించే సమయంలో కొన్ని విభాగాధిపతులు తడబడ్డారు. నిపుణులు అడిగిన ప్రశ్నలకు కూడా కొందరు సూటిగా స్పందించలేకపోయారు.
నేటి పర్యటన వివరాలు..
నాక్ నిపుణుల బృందంలో మంగళవారం ఆచార్య రాజేందర్‌సింగ్, ఆచార్య వసంత్ జుగాలే, ఆచార్య ఆరుణ్‌కుమార్‌లు ఒంగోలు పీజీ సెంటర్‌ను సందర్శిస్తారు. ప్రొఫెసర్ హెచ్‌పీ ఖించా, ఆచార్య టీఎన్ మాథూర్, ప్రొఫెసర్ ఎన్‌పీ శుక్లా, ప్రొఫెసర్ టి శ్రీనివాస్, పొఫెసర్ అరుణ్‌కుమార్‌లు ఏఎన్‌యూలోని లైబ్రరీ, బాలుర వసతి గృహాల్లో భోజనశాల, ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్, టెప్ సెంటర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, పరిపాలనా భవన్‌లోని వివిధ కార్యాలయాలు, కంప్యూటర్ సెంటర్, పరీక్షా భవన్, ఆక్వాకల్చర్ సెంటర్, లేడీస్ హాస్టల్, స్పోర్ట్స్ హస్టల్, క్రీడామైదాన, సింథటిక్ ట్రాక్‌లను సందర్శిస్తుంది.
Advertisement
Advertisement