
'తీరు మార్చుకోకపోతే తిప్పలే'
‘‘మంత్రివర్గం ఏర్పాటై ఏడాదిన్నర దాటింది. ఏ విషయాన్ని మీరు సీరియస్‌గా పట్టించుకోవడంలేదు. మీ శాఖల అంశాలపై లోతుగా పట్టు సాధించడంలేదు. పార్టీ వ్యవహారాలను అంత శ్రద్ధగా పట్టించుకోవడంలేదు. మంత్రులం అయిపోయాంలే ఇక మాకు తిరుగు ఏముందిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోండి. మీ మీ శాఖలపై పట్టు పెంచుకోండి. జిల్లాల్లోనూ పట్టు సాధించండి’’ అని ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పనితీరు ఎలా ఉంది? మీ జిల్లాల్లో మీ పరిస్థితి ఏంటి? అన్ని సమగ్ర వివరాలు నా వద్ద ఉన్నాయి.
మీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించా రు. పనితీరు మార్చుకోకపోతే తరువాతి పరిణామాలకు చింతించాల్సి ఉంటుందని కేబినేట్ సమావేశంలో ఆయన పరోక్షంగా భవిష్యత్తు సూచనలను తెలియజేసినట్లు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. జన్మభూమి నిర్వహణ అంశంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలోనూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
నాయకులు బాడీలాంగ్వేజ్ మార్చుకోవాలని, వ్యవహారశైలిలో, మాటతీరులో మార్పురావాలని సూచించారు. వారి చేరికవల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని భావిస్తే ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానించండని ఆదేశించారు. ప్రస్తుతం పరిశ్రమలకు ఉన్న టారిఫ్‌పై 4% విద్యుత్తు ఛార్జీలను పెంచాలని కేబినెట్‌లో నిర్ణయం జరిగింది. గృహ వినియోగంలో 200 యూనిట్లు మించిన వారికి 2.5% ఛార్జీలను పెంచాలనే సూత్రప్రాయ నిర్ణయం జరిగింది. దీనిపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో మరోసారి చర్చించి నిర్ణయానికి వద్దామని మంత్రివర్గం అభిప్రాయపడింది.