తన్నుకుపోతారా? రద్దు చేస్తారా?
- ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు నిరాదరణ
- తన్నుకుపోతారా? రద్దు చేస్తారా?
- రద్దు కుట్ర అంటున్న పాసింజర్లు
విశాఖపట్నం: ఎన్నో ఏళ్ల డిమాండ్ ఫలితంగా వచ్చిన విశాఖ-న్యూదిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ విశాఖవాసుల అవసరాలు తీర్చడం లేదు. ఆనందాన్ని పంచడం లేదు. విమాన టికెట్‌ను తలపించే చార్జీలు, వేళగాని వేళలో ప్రయాణం వెరసి ఈ రైలు ప్రయాణికులకు అక్కరకు రావడం లేదు. ఈ రైలు ఆక్యుపెన్సీ రేటు ఆశాజనకంగా లేదు.
పదకొండు నెలల క్రితం ఆగస్టు 12న ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభించారు. తొలుత వారానికి మూడు రోజులే నడిచిన ఈ రైలును నాలుగు నెలల తర్వాత నుంచి రోజూ నడుపుతున్నారు. 16 బోగీల ఈ ఏసీ రైలులో ఏసీ ఫస్ట్‌క్లాస్ ఒకటి, సెకండ్‌క్లాస్ 5, థర్డ్‌క్లాస్ 7 బోగీలు రెండు ఉంటాయి.
విశాఖ నుంచి దిల్లీకి ఫస్ట్‌క్లాస్ టికెట్ చార్జి రూ.5075, సెకండ్ క్లాస్ రూ.2940, థర్డ్‌క్లాస్ రూ.2005 ఉంది. విశాఖపట్నం నుంచి న్యూదిల్లీకి విమాన టికెట్‌ను వారం, పది రోజులు ముందుగా బుక్ చేసుకుంటే రూ.5 వేలకే లభిస్తుంది. పైగా రెండు, మూడు గంటల్లోనే దిల్లీ చేరుకోవచ్చు. అదే మన ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో అయితే 2099 కిలోమీటర్ల దూరాన్ని 35 గంటల 15 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుంది. అంటే రోజున్నర సమయమన్న మాట.
దీంతో అన్ని గంటలు రైల్లో కూర్చోలేక ఒకింత స్తోమతున్న వారంతా విమానాల్లో దిల్లీ వెళ్లిపోతున్నారు. సామాన్యులు ఆ చార్జీలను అందుకోలేక ప్రత్యామ్నాయ రైళ్లలో పయనిస్తున్నారు. అంతే కాదు.. విశాఖలో ఉదయం ఈ రైలు 7.15కి బయల్దేరి మర్నాడు రాత్రి 7 గంటలకు దిల్లీ చేరుకుంటుంది. దీనివల్ల ఆ రాత్రి దిల్లీలో విధిగా బస చేయాల్సి వస్తుంది. ఇది కూడా ప్రయాణికులకు ఎంతో భారంగా పరిణమిస్తోంది. దీంతో ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారి ఆక్యుపెన్సీ రేటు 60-70 శాతానికి మించడం లేదు. ఫలితంగా నష్టాల పట్టాలపై ఈ బండి పరుగులు తీస్తోంది.
వేగం పెంచరేం?: ఏపీ ఏసీ సూపర్‌ఫ్టాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జర్మనీ టెక్నాలజీతో తయారైన బోగీలు అమర్చారు. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణించేందుకు అనుమతి ఉంది. కానీ ఈ ట్రెయిన్ సగటు వేగం గంటకు 59 గంటలకు మించడం లేదు. అందువల్లే పేరుకు సూపర్‌ఫాస్ట్ అయినా సాదాసీదా ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే దిల్లీ వెళ్తోంది.
విశాఖ నుంచి నిజాముద్దీన్ (దిల్లీ)కు అదే రూట్‌లో వెళ్లే లింక్ ఎక్స్‌ప్రెస్‌కు 37 గంటల సమయం పడుతోంది. అంటే ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్ కంటే రెండు గంటల ఆలస్యంగా చేరుతుంది. పైగా ఈ రైలు సాయంత్రం ఇక్కడ బయల్దేరి మూడో రోజు తెల్లవారు జామున 4 గంటలకు నిజాముద్దీన్ వెళ్తుంది. అందుకే ఈ రైలుకున్న డిమాండ్ ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు ఉండడం లేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ రైలు వేగం పెంచాలని, ఉదయం వేళ దిల్లీ చేరుకునేలా విశాఖ నుంచి బయల్దేరే వేళలు మార్చాలని ప్రయాణికులు ఎప్పట్నుంచో కోరుతున్నారు.
అయినా రైల్వే వర్గాలకు వీరి విజ్ఞప్తులు చెవికెక్కడం లేదు. కొన్నాళ్ల పాటు ఇలాగే నడుపుతూ ప్రయాణికుల ఆదరణ లేదన్న వంకతో ఈ రైలును రద్దు చేసే కుట్ర జరుగుతోందన్న వాదనలూ ఉన్నాయి. అందుకే అటు వేళలు మార్పు గాని, వేగం పెంచడం గాని చేయడం లేదని అంటున్నారు.