ముద్రగడ దీక్షతో ఏపీ సర్కార్లో హై టెన్షన్
విజయవాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది. దీంతో వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం హుటాహుటీన విజయవాడ బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయంలోనే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ముద్రగడ దీక్షతో పాటు, కిర్లంపూడిలోని తాజా పరిణామాలపై చినరాజప్ప వివరించారు. ఇక తుని ఘటనలో సీఐడీ అరెస్ట్లు కొనసాగుతున్నాయి. కాగా తూర్పుగోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలు అమలు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంది. అలాగే కిర్లంపూడిలో పోలీసులు భారీగా మోహరించారు. డిఐజి రామకృష్ణ, ఎస్పీ రవి ప్రకాశ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు రాజమండ్రి అర్బన్లో 144 సెక్షన్ అమలు అవుతోంది.