'ఎర్ర' స్మగ్లర్ల ఆస్తులు జప్తు!
- అటవీచట్టం-1967లో సవరణల ద్వారా సాధ్యం.. ఆ దిశగా ఆలోచించండి
- శాంతిభద్రతల సమీక్షలో అధికారులతో సీఎం చంద్రబాబు
అవసరతీసుకురావాల్సి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్ల కార్యకలాపాలు మళ్లీ పెరిగాయని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉండేలా అటవీచట్టం-1967లో సవరణలు తీసుకురావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సీఎం తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
ఎర్రచందనం స్మగర్ల ఆగడాలకు అరికట్టేలా నిరంతరం నిఘా ఉంచాలని, సీసీటీవీ మానిటరింగ్, ఎఫెక్టివ్ ట్రెంచింగ్, అవుట్‌పోస్టులు పెంచడం, అదనపు సిబ్బంది నియామకం వంటి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోలీస్ శాఖలో సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసుకుని, నేరాల నియంత్రణలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో సమర్థత పెంచుకోవాలని అన్నారు. గతంలో పలు నేరాల్లో గుర్తించిన 2వేల మంది నేరగాళ్ల వేలిముద్రలు, ఐరీష్ నమూనాలను సేకరించి సెంట్రల్ సర్వర్‌లో నమోదు చేసి వారి కదలికలపై నిఘా పెంచాలని అన్నారు.
అన్ని స్థాయిల్లోను పోలీసులు పనిచేసిన చోట్ల నేరాల నియంత్రణలో పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డును తయారు చేయాలని అన్నారు. వారి హయాంలో ఆయా స్టేషన్‌లలో నమోదైన కేసుల సంఖ్య, నిందితులకు పడ్డ శిక్షలు తదితర వివరాలతో పోలీసుల పనితీరును బేరీజు వేసే ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
భవిష్యత్‌లో పోలీస్ శాఖలో తీసుకునే నిర్ణయాలకు ఈ ట్రాక్ రికార్డు ఒక ప్రాతిపదికగా ఉంటుందని అన్నారు. సమావేశంలో శాంతిభద్రతల డీడీజీ ఆర్పీ ఠాకూర్, ఇంటలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఐజీ హరీశ్‌గుప్తా, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌లు గౌతం సవాంగ్, అమిత్‌గార్గ్, సీఎంవో సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు.