కోనసీమలో భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేసులతో భయాందోళనలకు గురిచేసి కాపు ఉద్యమాన్ని అణచివేసే కుట్రకు ఏపీ సర్కారు తెరతీస్తోంది. మంజునాధ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వం ఇచ్చిన గడువు(ఆగస్టు)లోపు సర్కార్ స్పందించకుంటే సెప్టెంబరు నుంచి మలివిడత ఆందోళనకు సిద్ధమని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. దీంతో ఈలోపే ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాపు యువతపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది.
కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో జనవరి 31న ముద్రగడ ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై సుమారు 350 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అమాయకులను, కేసులతో సంబంధం లేని వారిని వేధింపులకు గురిచేయబోమని చర్చల సందర్భంగా చంద్రబాబు సర్కారు చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఉద్యమంతో సంబంధం లేని వారిని, కాపేతరులను కూడా సోమవారం పోలీసులు ఏకకాలంలో తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని భయోత్పాతాన్ని సృష్టించారు.
పోలీసు పికెట్లు.. సీసీ కెమేరాల ఏర్పాటు
కోనసీమలో సోమవారం అర్థరాత్రికి లేదా మంగళవారం పెద్ద ఎత్తున అరెస్టులు చేయాలనే తలంపుతో భారీగా పోలీసులను మోహరించింది. పోలీసు పికెట్లు, కూడళ్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. మొదటి విడతగా క్షేత్రస్థాయిలో ఉన్న కాపు యువతను అరెస్టుచేసి రెండో విడతలో తుని సంఘటన రోజు ఉద్యమానికి పలు ప్రాంతాల్లో నాయకత్వం వహించిన నేతలను అరెస్టు చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా అమలాపురంలో సోమవారం పలువురు కాపు యువకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.