
చంద్రబాబు నాలుగెకరాలు కొనుక్కోలేరా?
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పార్టీ ముసుగులో ఖరీదైన భూములు కాజేసేందుకు చంద్రబాబు తప్పుడు పాలసీ తీసుకు వచ్చారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నల్లపాడులో రైతుల భూములు లాక్కోవడం దారుణమన్నారు.
భూములను చంద్రబాబు యథేచ్చగా మింగేస్తున్నారని, రైతుల భూములు లాక్కొని పార్టీలకు ఎలా ఇస్తారని అంబటి ప్రశ్నించారు. బినామీ పేర్లతో వేలకోట్లు దోచుకుంటున్న చంద్రబాబు నాలుగెకరాల భూమిని కొనుక్కోలేరా అని వ్యాఖ్యానించారు. రాజధానిలో నాలుగెకరాలు.. జిల్లాల్లో రెండు ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నారని అంబటి అన్నారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపు పేరుతో చంద్రబాబు పెద్ద మొత్తంలో టీడీపీకి భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి కేటాయిస్తామనడం సరైన పద్దతి కాదన్నారు.
రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును అడ్డుకోని బీజేపీ దుర్మార్గానికి పాల్పడిందని వైఎస్ఆర్ సీపీ నేత అంబటిరాంబాబు విమర్శించారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్డీఏనే ప్రత్యేక హోదాను ప్రకటించాల్సింది పోయి...ప్రైవేటు బిల్లును కూడా గందరగోళం సృష్టించి అడ్డుకొని పార్లమెంటరీ సంప్రదాయాల్ని తుంగలో తొక్కిందని అంబటి ఆరోపించారు. విభజన సమయంలో యూపీఏ ప్రవర్తిన తీరుగానే ఇప్పుడు ఎన్డీఏ ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు.
బాబు భూముల్ని కొల్లగొడుతున్నారు..
విజయవాడ: పేదల నుంచి భూములు లాక్కొని పెద్దలకు కట్టబెట్టడం చంద్రబాబు నాయుడుకు అలవాటైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు భూ భకాసురుడిగా మారి భూములను కొల్లగొడుతున్నారన్నారు. పేదల నుంచి వేల ఎకరాలను లాక్కొని పార్టీలకు లీజుకు ఇవ్వడాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు.