‘కార్పొరేట్’కు సర్కార్ రెడ్ కార్పెట్
‘కార్పొరేట్’కు సర్కార్ రెడ్ కార్పెట్
Published Sun, Oct 16 2016 9:20 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
మంగళగిరి: ప్రతిభా పురస్కారాల ఎంపికలో సర్కార్ కార్పొరేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై వివక్ష చూపిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పదో తరగతిలో ప్రతిభ కనపరచిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు వారిని విస్మరించి ప్రై వేటు పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. మంగళగిరి మండలంలో ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేయగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి అని వివరించారు. రాజధాని గ్రామాల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు చదువును మధ్యలో ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి రైతు కూలీలు, చేతివృత్తుల వారు పిల్లలను చదివించలేక కూలి పనులకు పంపుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు గులాం చేయడం మానుకుని ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని ఆర్కే సూచించారు.
Advertisement
Advertisement