24 గంటలు భారీ వర్షాలే | AP in 24 Hours Heavy rains | Sakshi
Sakshi News home page

24 గంటలు భారీ వర్షాలే

Published Wed, Sep 14 2016 2:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

24 గంటలు భారీ వర్షాలే - Sakshi

24 గంటలు భారీ వర్షాలే

నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. రహదారులపైకి చేరిన వరద నీరు
స్తంభించిన రాకపోకలు.. గుంటూరు జిల్లా కరాలపాడులో మట్టిమిద్దె కూలి వృద్ధురాలు మృతి
గురజాలలో వంద మీటర్ల మేర కొట్టుకుపోయిన రైల్వేట్రాక్  
పత్తి, మిరప చేలు నీట మునక.. పంట నష్టంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా
బాధిత రైతులకు అండగా నిలవాలని పార్టీ నాయకులకు సూచన    


సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు బలోపేతం కావడం, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో పలుప్రాంతాల్లో రాకపోకలు స్తంభిం చాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురజాలలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి దండెవాగు ఉధృతంగా ప్రవహించి, రైల్వేస్టేషన్ సమీపంలో 100 మీటర్ల మేర ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో నడికుడి-మాచర్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

రైల్వే అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను ప్రారంభించారు. రెంటచింతల వద్ద గాడిదల వాగు పొంగి ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల ఎత్తున ప్రవహిస్తుండటంతో మాచర్ల-గురజాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గురజాల-కారంపూడి, గురజాల-దైద గ్రామాల మధ్య వాగులు రోడ్లపై ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పిడుగురాళ్ల మండలం కరాలపాడులో మట్టి మిద్దె కూలిపోయి పందెళ్ల కృష్ణవేణమ్మ(63) అక్కడికక్కడే మృతి చెందింది. గుంటూరు జిల్లా దుర్గిలో అత్యధికంగా 27.3 సెంటీమీటర్లు, మాచర్లలో 17.1, రెంటచింతలలో 14.3, గురజాల 13.06, వెల్దుర్తిలో 12.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
 
నీట మునిగిన పత్తి, మిర్చి
గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాల్లో పత్తి, మిర్చి పంటలు పూర్తిగా నీట మునిగాయి. వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడులో పంట నష్టం గురించి తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని సూచించారు.
 
ప్రకాశంలో భారీ వర్షం
ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సోమవారం రాత్రి నుంచి కుండపోత వాన కురిసింది. దీంతో గుండ్లకమ్మ నదిలోకి భారీగా వరదనీరు చేరింది. ఒంగోలు రూరల్ పరిధిలోని కొత్తపట్నం సమీపంలో నల్లవాగు ఉధృతంగా ప్రవిహ ంచడంతో మంగళవారం సాయంత్రం వరకు ఒంగోలుకు రాకపోకలు నిలిచిపోయాయి. చీరాలలో వర్షంతోపాటు భారీ ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్(1077)ను ఏర్పాటు చేశారు.
 
కర్నూలు జిల్లాలో వర్ష బీభత్సం
కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి ఆళ్లగడ్డలో అత్యధికంగా 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆళ్లగడ్డ, మహానంది, నంద్యాల తదితర మండలాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కర్నూలు డివిజన్‌లోని వివిధ మండలాల్లో కురిసిన వర్షాలకు ఉల్లి పంట తడిచిపోయింది. జిల్లా మొత్తం మీద సగటున 17 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  
 
విశాఖలో విస్తారంగా వర్షాలు
విశాఖ జిల్లాలోనూ మంగళవారం పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ వానలు కురుస్తూనే ఉన్నాయి. అయితే, నగరంలో మాత్రం చిరు జల్లులే పడ్డాయి.
 
పులిచింతలకు పోటెత్తిన వరద
పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు పొటెత్తుతోంది. సోమవారం రాత్రి పల్నాడుతోపాటు తెలంగాణలో వర్షాలు కురవడంతో భారీగా వరద నీరు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతోంది. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతానికి ప్రాజెక్టు నీటిమట్టం 20.35 టీఎంసీలకు చేరింది. మంగళవారం మధ్యాహ్నం ఊహించని విధంగా 2,73,000 క్యూసెక్కులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12,738 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రాజెక్టులోకి 89,905 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఒక్క రోజే 4 టీఎంసీలకు పైగా నీరు ప్రాజెక్టులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా తెల్లారేసరికి ప్రాజెక్టులోకి మరో 2 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో ముంపు గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
నేడూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురం (రెంట చింతల)లో 23 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఇప్పటిదాకా పశ్చి మ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని ఏర్పడ్డ అల్పపీడనం లో మంగళవారం నాటికి స్వల్ప కదలిక వచ్చింది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాకు ఆనుకుని కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఆవరించి ఉంది. మరోవైపు కోస్తాంధ్రపై నైరుతీ రుతుపవనాలు బలంగా ఉన్నాయి.

వీటన్నింటి ప్రభావంతో బుధవారం కూడా కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, క ర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.
 
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి
కోస్తాంధ్రలో తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. గడచిన 24 గంటల్లో జంగమహేశ్వరపురంలో 23, మాచర్ల, చీమకుర్తిలో 17.1, ముండ్లమూరులో 15.8, ఒంగోలు 14.4, కారంచేడు 14, దర్శి 13.2, పిడుగురాళ్లలో 9, ఎర్రగొండపాలెం, అద్దంకిలో 7, పొదిలి, నర్సీపట్నం, ఆళ్లగడ్డలో 6.2, చోడవరం, బాపట్ల, నెల్లిమర్ల, మర్రిపూడిల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
 
2-3 రోజుల్లో నైరుతి నిష్ర్కమణ మొదలు
ఇదిలా వుండగా దేశం నుంచి  నైరుతీ రుతుపవనాల నిష్ర్కమణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో రాజస్తాన్ నుంచి ఇవి నిష్ర్కమించనున్నాయని భారత వాతావరణ కేంద్రం  (ఐఎండీ) మంగళవారం రాత్రి ప్రకటించింది. మన రాష్ట్రం నుంచి ఈ నెలాఖరులోగా నిష్ర్కమిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి నిష్ర్కమణ వేళ బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆవర్తనాలు ఏర్పడుతుంటాయని, ప్రస్తుత అల్పపీడనానికి అదే సంకేతమని వాతావరణ అధికారి(రిటైర్డ్) రాళ్లపల్లి మురళీకృష్ణ  చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement