
మంత్రి ర్యాంకు మారింది కదా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా మంత్రి అచ్చెన్న పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో తాజాగా ర్యాంకులు ప్రకటించారు. ఎమ్మెల్యే హోదాలో ఆయనకు రాష్ర్టవ్యాప్తంగా 33వ ర్యాంకు వచ్చింది. మంత్రి స్థానంలో ఏడో ర్యాంకు, జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు తెచ్చుకున్నారని అధిష్టానమే ప్రకటించింది. అయితే జిల్లాలోని ఆయన అభిమానులు డే అండ్ నైట్ కూడలిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పనితీరులో నెం.1 మంత్రి వర్యులుగా గుర్తింపు పొందిన మన ప్రజానేత అంటూ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించేలా పెట్టారు. అయితే మంత్రి ర్యాంకు మారింది. ఆయన ర్యాంకు నెంబర్ 1 నుంచి 7కు దిగిపోయింది. అయినా ఫ్లెక్సీని అలాగే వదిలేశారు. మరో విశేషమేమిటంటే తమ అధినేత ప్రకటించిన ర్యాంకులు ఆయా వ్యక్తుల పనితీరుకు కొలమానమేమీ కాదని సాక్ష్యాత్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావు మంగళవారం విశాఖలో సెలవిచ్చారు.
సీఎం ఇచ్చిన ర్యాంకుల్ని పట్టించుకోనక్కర్లేదని పార్టీ నేతలే స్పష్టం చేస్తుంటే అలాంటప్పుడు తమ నేత నెంబర్-1 అంటూ తమ్ముళ్లు గొప్పలు చెప్పుకోవడం ఏంటంటూ దారంట పోయేవాళ్లు ఫ్లెక్సీని చూసి నవ్వుకొంటున్నారు. గతంలో పలు మీడియా సమావేశాల్లోనూ తెలుగు తమ్ముళ్లు స్థానిక నేతలకు వచ్చిన ర్యాంకుల్ని బయటపెడుతూ గొప్పలకు పోవడాన్ని అంతా గుర్తుచేసుకొంటున్నారు.