'బాబు ప్రభుత్వం బలహీనపడింది'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం బలహీనపడిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ ప్రభుత్వం బలహీనపడడంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో పార్టీ మారే అధికారం ఎవరికైనా ఉంటుంది. వేరే పార్టీలోకి వెళ్లదలుచుకున్న వారు తమ పదవికి రాజీనామా చేసి వెళ్లాలని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రజల మనోభావాలను ధిక్కరించి ప్రజాప్రతినిధులు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తున్న వారిపై 24 గంటల్లో ఎలెక్షన్ కమిషన్ అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
ద్రోహులు, దుర్మార్గులు మీ పార్టీలో చేరితే పునీతులు అవుతారా అని చంద్రబాబుని రఘువీరా ప్రశ్నించారు. కృష్ణదేవరాయలు, లేపాక్షి ఉత్సవాలను నాడు కాంగ్రెస్ పార్టీనే రాజకీయాలకు అతీతంగా జరిపిందన్నారు. చరిత్రకారుల వైభవాన్ని చాటడానికి ఉత్సవాలు చేయాలి కానీ సొంత ప్రచారాల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో కాదని విమర్శించారు. ఉత్సవాలు జరుగుతున్న చోట అన్ని సినిమా బొమ్మలే కనపడుతున్నాయని, కృష్ణదేవరాయలు, విరూపన్న బొమ్మలు ఎక్కడ కనబడటం లేదన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశద్రోహులనడం నీచం, దుర్మార్గమని బీజేపీని రఘవీరా దుయ్యబట్టారు.