ఎయిర్‌ఫోర్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కడప కల్చరల్ :
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని యువజన సర్వీసుల శాఖ, స్టెప్ సీఈఓ టి.మమత ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరులో నిర్వహించే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని పురస్కరించుకుని జిల్లాలోని అవివాహితులైన నిరుద్యోగ యువకులు ముందస్తు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెక్యూరిటీ పోస్టులకు ఇంటర్మీడియేట్ లేదా తత్సమాన పరీక్ష కనీసం 50 శాతం మార్కులు, ఇంగ్లీషులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు చేసిన వారు కూడా అర్హులేనన్నారు. అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, తగిన బరువు, శ్వాస పీల్చినపుడు ఐదు సెంటీ మీటర్ల ఛాతి విస్తరణ కలిగిన వారు 1997, జనవరి 8వ తేది నుంచి 2000,జూన్ 28 మధ్యలో జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఉద్యోగానికి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.