కన్నవారే.. కాదన్నారు !
⇒ క్యాన్సర్‌తో మరణానికి చేరువవుతున్న భర్త.. పిల్లలతో కలసి అత్తింటివారిని ఆశ్రయం కోరిన కోడలు
⇒ ఇంట్లోకి రానీయని అత్తమామలు
⇒ రాత్రికి రాత్రే తాళం వేసి మాయమైన వైనం
⇒ అదే ఆవరణలో తుదిశ్వాస విడిచిన కొడుకు
విజయవాడ (రామవరప్పాడు) : కష్టాల్లో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నవారే కాదన్నారు.. తమ బిడ్డకు ప్రాణాంతక వ్యాధి సోకిందన్న ఇసుమంత బాధ కూడా లేకుండా కర్కశంగా ప్రవర్తించారు.. మంచానికే పరిమితమైన భర్తతో అతని అర్ధాంగి దిక్కుతోచక మెట్టింటివారి సహాయం కోసం ఆత్రుతతో వస్తే ఇంట్లోకి రానీయలేదు.. బాధితుడి తల్లి, తండ్రి, సోదరుడు రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి మాయమయ్యారు. దీంతో మరణానికి దగ్గరగా ఉన్న భర్తతో పాటు తన ఇద్దరు కూతుళ్లతో ఆ అభాగ్యురాలు మెట్టింటి ఆరు బయటే వేచి ఉంది. అయితే ఆదివారం రాత్రి పదిగంటల సమయానికి మధుబాబు అక్కడే తుది శ్వాస విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన
ప్రసాదంపాడులో ఆదివారం జరిగింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రసాదంపాడు గ్రామానికి చెందిన కొండూరి కోటేశ్వరరావు, కృష్ణకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు కొండూరి మధుబాబు, రెండో కొడుకు ప్రేమ్‌బాబు. మధుబాబు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఇదే గ్రామానికి చెందిన మాధవిని 15 సంవత్సరాల క్రితం ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు సుచిత్ర, స్రవంతి. వీరంతా కలిసే ఉండేవారు. ఇటీవల మధుబాబుకు నోటి క్యాన్సర్ సోకింది. ఆదుకోవాల్సిన కుటుంబసభ్యులే పట్టించుకోకపోవడంతో గ్రామంలోనే వేరు కాపురం పెట్టారు. మరోపక్క నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డుపై శస్త్ర చికిత్స చేయించారు. కానీ వ్యాధి తిరగబెట్టడంతో నోటి నుంచి శరీరం లోపలి వరకు పాకింది. దీంతో రెండోసారి శస్త్ర చికిత్స చేయిస్తే ప్రాణానికి ప్రమాదమని సాహసించలేకపోయారు.
ఇంటి యజమాని ఖాళీ చేయమన్నారు...
వ్యాధి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఇంటి యజమాని తమ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని, ఖాళీ చేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో మరణానికి దగ్గరగా ఉన్న భర్తతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని మాధవి మెట్టింటి వారికి తన బాధ మొరపెట్టుకుంది. ఇంటిని ఖాళీ చేయంటున్నారని, మీరు అనుమతిస్తే ఇక్కడికి వస్తామని బతిమాలుకుంది. అందుకు అంగీకరించిన మధుబాబు తల్లిదండ్రులు రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి మాయమయ్యారు. దీంతో చేసేదేమీ లేక తన ఇద్దరు కూతుళ్లు, భర్త మధుబాబుతో మెట్టింటి ఆరు బయటే ఉన్న మాధవి చివరికి అతని ప్రాణాలు పోవటంతో శోకసంద్రంలో మునిగిపోయింది.
మా కొడుకే కాదు పొమ్మన్నారు
నా భర్తకు క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆయన పరిస్థితి దారుణంగా తయారై మంచానికే పరిమితమయ్యాడు. వైద్యులు కూడా కాపాడలేమంటూ చేతులెత్తేశారు. మెట్టింటి వారు ఇంట్లోకి రానీయడం లేదు. అసలు మధుబాబు మా కొడుకే కాదని పొమ్మన్నారు. అద్దె ఇల్లు ఖాళీ చే సి మెట్టింటికి వస్తే లోపలికి రానీయకుండా తాళం వేశారు.
- మాధవి, మధుబాబు భార్య