ప్రజలకు వాస్తవాలు తెలిపేదిగా పత్రికారంగం ఉండాలి
ప్రజలకు వాస్తవాలు తెలిపేదిగా పత్రికారంగం ఉండాలి
Published Sun, Jul 23 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM
- ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలో డిప్యూటీ సీఎం రాజప్ప
కాకినాడ సిటీ : ప్రజలకు వాస్తవాలు తెలియజేసేవిధంగా పత్రికారంగం ఉండాలని, అటువంటి పాత్రికేయులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా మహాసభ ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజప్ప మాట్లాడుతూ, నిజమైన వార్తలు రాసినప్పుడు రక్షణ ఉంటుందని, అవాస్తవమైన వార్తలు రాసినప్పుడు చర్యలు తప్పవని అన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇప్పటికే ఇన్సూరెన్స్, హెల్త్‌కార్డ్ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇళ్లస్థలాలు, గృహ నిర్మాణానికి చర్యలు చేపడతామని, ఏజెన్సీలో ఇళ్ల సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు చేపడతామని, అనారోగ్యం తదితర సమస్యలు వస్తే సీఎం సహాయ నిధి నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి విలేకరులు వారధి వంటి వారని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, ఎ.ఆనందరావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, ఆదిత్యా విద్యాసంస్థల చైర్మన్ ఎన్.సతీష్‌రెడ్డి, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఫ్రాన్సిస్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఏపీయూడబూ‍్ల్యజే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ధర్మారావు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డి.సోమసుందరం, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీరామ్మూర్తి, జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement