అవినీతిలో ప్రథమం అభివృద్ధిలో అథమం
ప్రభుత్వ విధానాలపై యువత పోరాడాలి
జగన్ పుట్టినరోజున సేవాకార్యక్రమాలు
జిల్లా యూత్ సమావేశంలో కన్నబాబు
కాకినాడ : ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కార్ అవినీతిలో ప్రథమంగాను, అభివృద్ధిలో అథమస్థానంలో నిలిచిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. స్థానిక డి కన్వెన్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జిల్లా యూత్ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కన్నబాబు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సింగపూర్, మలేషియాలు పర్యటించి చివరకు బాహుబలి చిత్రనిర్మాత రాజమౌళితో మాహిష్మతి నగర రూపురేఖలతో నిర్మాణమంటూ విన్యాసాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అధికారాన్ని కట్టబెడితే యువతకు మొండిచెయ్యి చూపారని కన్నబాబు «ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి పోరాడాలని ఆయన యువజన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏజన్సీ ప్రాంతంలో కాళ్లవాపు వ్యాధులు, పౌష్టికాహారలోపం, వసతిగృహ నిర్వహణ లోపాలను ఎత్తిచూపి గిరిజనులకు అండగా నిలవడం ద్వారా జగన్ అధికార పక్షాన్ని ఉలిక్కిపడేలా చేశారన్నారు. నిద్ర నటిస్తోన్న ప్రతిపక్షాన్ని మేల్కొలిపే బాధ్యత యువజన విభాగానిదేనన్నారు. ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అన్న నినాదం పోయి ‘బాబు పోతేనే జాబు’ అనే పరిస్థితి ఉందన్నారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతీ యువజన కార్యకర్త సుసిక్షితులైన సైన్యంలా పనిచేసి ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోరాడాలన్నారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేసిన చంద్రబాబు తీరుపై యువత గట్టిగా పోరాడాలన్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ చంద్రబాబు మాటలు నమ్మి యువత ఎంతో మోసపోయారన్నారు. జనవరి నుంచి దశలవారీగా ప్రభుత్వ యువజన వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. యువజన విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు అలంకారప్రాయం కాకుండా పదవికి వన్నె తెచ్చేలా, ఇతర జిల్లాలకు స్ఫూర్తినిచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రెండు సమావేశాలకు మించి హాజరుకాకపోతే ఆ నాయకులు స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకోవాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే బాధ్యత యువజన కార్యకర్తలదేనన్నారు. కాకినాడ నగర పార్టీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబుపాలనలో కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్తీక్‌తోపాటు పలువురు నాయకులు ప్రసంగిస్తూ గ్రామస్థాయి నుంచి యువజన విభాగాన్ని పటిష్టం చేయాలన్నారు.
నేతలకు ఘన సత్కారం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం తొలిసారిగా జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన జక్కంపూడి రాజాకు ఘన సత్కారం జరిగింది. కాకినాడ నగరం యువజన విభాగం అధ్యక్షుడు బి.కిషోర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జక్కంపూడి రాజాతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌లను గజమాలతో సన్మానించారు.
ఘనంగా జగన్ పుట్టినరోజు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. పేద వర్గాలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించా రు. జిల్లాలోని మూడుపార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అన్నవరం, అయినవిల్లి, కోరుకొండల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల పక్షాన పోరాడేలా శక్తిని ప్రసాదించాలని పూజలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అమలాపురం నగర యువజన విభాగం అధ్యక్షుడు నల్లా శివాజీ, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి లింగం రవి, కాకినాడ నగర యువజన విభాగం అధ్యక్షుడు ఎం. కిషోర్ వివిధ మండలాలకు చెందిన రాష్ట్ర, జిల్లా కమిటీల్లో యువజన విభాగంలోని నాయకులు హాజరయ్యారు.