ఆక్వా పార్క్ నిర్మాణం ఆపాలంటూ ధర్నా
భీమవరం టౌన్: తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు పనులను తక్షణం నిలుపుదల చేసి ఫ్యాక్టరీని మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మెంటే వారితోటలోని సుందరయ్య భవనం నుంచి మండుటెండలో ప్రదర్శనగా బయల్దేరిన సీపీఎం నాయకులు, కార్యకర్తలు పీపీ రోడ్డు ప్రకాశంచౌక్, బాంబే స్వీటు సెంటర్ మీదుగా జువ్వలపాలెం రోడ్డులో ఉన్న ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీల కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. తక్షణమే ఆక్వాఫుడ్ పార్కు పనులు నిలిపివేయాలని జనావాసాల నుంచి ఆ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించాలని, గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తి వేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం భీమవరం పట్టణ కార్యదర్శి బీవీ వర్మ, జిల్లా కమిటీ సభ్యుడు గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా 40 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది పోలీసులను మోహరించి గ్రామీణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పర్యావరణం, ప్రజారోగ్యం, పంట పొలాలు, భూగర్భ జలాలకు హాని చేసే ఆక్వాఫుడ్ పార్కు ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రేవు రామకృష్ణ, ఎం.వైకుంఠరావు, చెల్లబోయిన వేంకటేశ్వరరావు, అల్లూరి అరుణ్, కె.రంగారావు, పి.మంగరాజు తదితరులు పాల్గొన్నారు.