జగన్ అండ లేకుంటే ప్రభుత్వం పేట్రేగిపోయేది
- జైలు నుంచి విడుదలైన తుందుర్రు ఆక్వా పార్క్ ఉద్యమకారులు
- వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు
నరసాపురం: కాలుష్య కారకమైన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేపట్టిన ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలవకపోతే ప్రభుత్వం మరింత పేట్రేగిపోయేదని ఉద్యమ నాయకులు అన్నారు. ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలంటూ ఉద్యమించిన కారణంగా హత్యాయత్నం నేరంపై 51 రోజుల క్రితం అరెస్టయి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆక్వాపార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మంగళవారం విడుదలయ్యారు.
హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో నరసాపురం సబ్‌జైలులో పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు, ముఖ్య నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు, సముద్రాల వెంకటేశ్వరరావు, కలిగితి సుందరరావు, కొయ్యే మహేష్, బెల్లపు సుబ్రహ్మణ్యంలను సబ్‌జైల్ అధికారులు విడుదల చేశారు. భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని ఆక్వాపార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నరసాపురం సబ్‌జైలు వద్దకు చేరుకుని ఉద్యమ నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైలు నుంచి విడుదలైన నాయకులు మాట్లాడుతూ.. ఆక్వా పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించే వరకు ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఇకనైనా వాస్తవాలు గ్రహించి ప్రజలపక్షాన నిర్ణయం తీసుకోకపోతే గుణపాఠం చెబుతామన్నారు.