AQUA PARK
-
ఆక్వా పార్క్ వివాదం.. హైకోర్ట్‌లో విచారణ
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ పోరాటం అనేది అందరి బాధ్యత. దాన్ని స్వచ్ఛందంగా చేపట్టి కొందరు సినీ ప్రముఖులు పోరాడుతున్నారు. కొత్వాల్ గూడలో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్.. పర్యావరణానికి పెద్ద ముప్పు కానుందని రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణం నిలిపేయాలని కోర్ట్‌ను ప్రముఖులు ఆశ్రయించారు. ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో జరిగాయి మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది. వీటికి సమాధానంగా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్కులతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ లకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుంది. పర్యావరణానికి చేటు చేసేలా ఉన్న ఈ ప్రాజెక్టుపై తమ పోరాటానికి మద్దతు కావాలని పిటీషనర్లలో ఒకరైన శశికిరణ్ తిక్కా చెప్పుకొచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ లో నీటి సమస్య ఉందని, ఆక్వా మెరైన్ వల్ల అది మరింత ఎక్కువవుతుందని సదా అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) -
ఆక్వా పార్కుతో రైతుకు మరింత భరోసా
బాపట్ల జిల్లాలో ఆక్వా పార్కు ఏర్పాటు వల్ల వేలాది మంది రైతులకు అనేక విధాలుగా మేలు కలగనుంది. రైతులకు స్థానికంగా అవసరమైన నాణ్యమైన సీడ్ దొరకనుంది. ప్రాసెసింగ్ యూనిట్లు కూడా అందుబాటులోకి రానుండటంతో గిట్టుబాటు ధర లభించనుంది. ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవారిపాలెం, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, నగరం, భట్టిప్రోలు తదితర మండలాల పరిధిలో 21,400 ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 2013 నుంచి వెనామీ రకం 80 శాతం సాగు చేస్తుండగా, మిగిలిన రకాలు 20 శాతం సాగు చేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, బాపట్ల ఆక్వా పార్కు రైతులకు వరం రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలంలోని పరిశావారిపాలెం వద్ద రూ.185 కోట్లతో 280 ఎకరాల్లో ఆక్వా పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ పార్కులో పీతలు, పండుగప్పలతోపాటు పలు రకాల చేపలు, రొయ్యల సీడ్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం వెనామీ, టైగర్ రొయ్యలు, పీతలు, పండుగప్పల సీడ్‌ను రైతులు తమిళనాడులోని రామే శ్వరం, రామనాథపురంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు అధికం కావడంతో రైతులకు ఆరి్థక భారం పెరుగుతోంది. అదేవిధంగా ప్రస్తుతం రైతుల నుంచి వ్యాపారులు రొయ్యలు, చేపలు కొనుగోలు చేసి కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. జిల్లా నుంచి ఏటా 52 దేశాలకు రూ.2వేల కోట్ల విలువైన రొయ్యలు, రూ.250 కోట్ల మేర చేపల ఎగుమతులు జరుగుతున్నాయి. అయినా స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. ఆక్వా పార్కు ఏర్పాటు వల్ల స్థానికంగా సీడ్ దొరకడంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గడంతోపాటు అధిక ధరలు లభించనున్నాయి. ఫలితంగా జిల్లాతోపాటు సమీప ప్రాంతాల్లో పదివేల ఎకరాల వరకు ఆక్వా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. రైతులకు మరింత మేలు మా ప్రాంతంలో ఆక్వా పార్కు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మరింత మేలు కలుగుతుంది. ఇక్కడ రొయ్యలతోపాటు పీతలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. స్థానికంగా పీతల సీడ్ దొరకదు. తమిళనాడుకు వెళ్లాలంటే రవాణా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే సీడ్ దొరికితే ఖర్చులు తగ్గుతాయి. గిట్టుబాటు ధర లభిస్తుంది. – మోపిదేవి శివనాగేశ్వరరావు, ఆక్వా రైతు, నిజాంపట్నం జగనన్నకు ధన్యవాదాలు మా మండలంలో ఆక్వా పార్కు ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం జగనన్నకు ధన్యవాదాలు. పార్కు వస్తే అన్ని రకాల సీడ్ దొ రుతుంది. రవాణా ఖర్చులు మిగులుతాయి. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మంచి ధర లభిస్తుంది. – కొక్కిలిగడ్డ జగదీష్, నిజాంపట్నం మండలం -
రాష్ట్రంలో ఆటవిక పాలన
నరసాపురం : రాష్ట్రంలో చంద్రబాబునాయుడి ఆటవిక పాలన సాగుతోందని చెప్పడానికి తుందుర్రు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలే నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. సోమవారం నాని ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ అనుభవిస్తున్న తుందుర్రు గోదావరి ఆక్వాఫుడ్పార్కు ఉద్యమకారులను పరామర్శించారు. జైలులో ఉన్న 22 మంది ఉద్యమకారులతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన నాని అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. కాలుష్య కారకమైన ఫ్యాక్టరీ ఇళ్ల మధ్య కట్టడం వల్ల తమ ఉపాధి పోతుంది, ఆరోగ్యాలకు ముప్పు కలుగుతుందని రెండేళ్లుగా 40 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తుంటే వారిపై తప్పుడు కేసులు పెట్టించి జైళ్లకు పంపడం దారుణమన్నారు. ప్రభుత్వం మాది, అధికారంలో ఉన్నాము కాబట్టి మా మాటే వినాలి అనే నియంతృత్వ ధోరణితో టీడీపీ సర్కారు వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమేనన్నారు. రెండు సార్లు కలిసిన తుందుర్రు ఆక్వాపార్కు బాధితుల పట్ల ముఖ్యమంత్రి కర్కశంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే తుందుర్రు రొయ్యల ఫ్యాక్టరీకి కాపలా దారుడిగా, గుత్తేదారుడిగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. లేకపోతే పాత కేసులు తిరగతోడి జనాన్ని జైళ్లలోకి నెట్టి, వందలమంది పోలీసుల పహారా మధ్య ఫ్యాక్టరీ నిర్మాణ పనులు సాగించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక ఫ్యాక్టరీ విషయంలో ఇంతమంది జనాన్ని ఎందుకు బాధపెడుతున్నారో ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పితాని సీఎం మెప్పుకోసం పాకులాడుతున్నారు కార్మిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పితాని సత్యనారాయణ తుందుర్రు ఆక్వాపార్కు విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశించామని నాని పేర్కొన్నారు. అయితే ఆయన తీరు నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేల కంటే అధ్వానంగా ఉందన్నారు. నేనున్నాను..సమస్యను పరిష్కరించేస్తానని మాయమాటలు చెప్పి బాధితులను రెండుసార్లు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. తీరా ముఖ్యమంత్రి బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోగా, సంబంధం లేకుండా జగన్ రెచ్చగొడుతున్నారంటూ పితాని ముందే, బాధితులకు సీఎం చివాట్లు పెట్టడం దారుణమన్నారు. మంత్రి పితాని సీఎం మెప్పుకోసం పాకులాడుతున్నారే తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో విషవాయువులు చిమ్మి ఐదుగురు ప్రాణాలు విడిచినప్పడు మంత్రి పితాని కమిటీ వేస్తానన్నారని చెప్పారు. తుందుర్రు ఫ్యాక్టరీ విషయంలో కూడా కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు. మంత్రి ప్రకటనలను వైఎస్సార్ సీపీ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఆ మాటలన్నీ ఏమైపోయాయో, ముఖ్యమంత్రి వద్దకు బాధితులను తీసుకెళ్లి ఏం ఒరగబెట్టారో కూడా మంత్రి పితాని చెప్పాలన్నారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన నేతలు వైఎస్సార్ సీపీ నాయకుల బృందం సబ్‌జైలుకు వచ్చే సమయంలో జైలులో ఉన్న వారి కుటుంబ సభ్యులు అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్నారు. మహిళలు పిల్లలతో సహా వచ్చి జైలులో ఉన్న తమ వారిని కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఆళ్ల నాని, పార్టీ ఇతర నాయకులు ముందుగా వారితో మాట్లాడారు. లక్కు వరలక్ష్మి తన ఇద్దరు చిన్నారులు అవినాష్, దిలీప్‌లతో కలసివచ్చి జైలు బయట కూర్చుని ఉంది. తన భర్త రామకృష్ణను జైలులో పెట్టారని నాన్న కావాలని ఏడుస్తుంటే, చూపిద్దామని జైలుకు తీసుకొచ్చానని వరలక్ష్మి రోదిస్తూ నాని ముందు వాపోయింది. వైఎస్సార్సీపీ నాయకులు ఆమెకు, ఇదే తరహాలో జైలువద్దకు వచ్చిన మరికొంత మందికి ధైర్యం చెప్పారు. తుదివరకూ పోరాడుదామని, ఈ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని నచ్చజెప్పారు. నరసాపురం, భీమవరం మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు గుణ్ణం నాగబాబు, కవురు శ్రీనివాస్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సాయిబాలపద్మ తదితరులు ఉన్నారు. -
అసెంబ్లీ వద్ద ఆక్వాపార్క్ బాధితుల అరెస్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్దకు గ్యాలరీ పాసులతో వచ్చిన నలుగురు ఆక్వాపార్క్ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్లను కలుస్తామని ఆక్వాపార్క్ బాధితులు వేడుకున్నా పోలీసులు వారిని అసెంబ్లీలోకి అనుమతించకపోగా.. అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో నలుగురు ఆక్వాపార్క్ బాధితులను అక్కడనుంచి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు వద్ద ప్రభుత్వం చేపడుతున్న ఆక్వాపార్క్ నిర్మాణంపై పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
ఆ ఇద్దరి ఎమ్మెల్యేల తీరు దారుణం
భీమవరం అర్బన్ : మా ఓట్లతో గెలుపొంది, మా సమస్యలను పరిష్కరించాల్సిన నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పులపర్తి రామాంజనేయులు గోదావరి ఫుడ్‌పార్కుసై మాట మార్చడం దారుణమని ఫ్యాక్టరీ బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామంలో శుక్రవారం ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ, మహిళలు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదిన ప్రపంచం మొత్తం మహిళల హక్కులను, మహిళల గౌరవ మర్యాదలను కీర్తిస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తుందుర్రులో మహిళలపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఫ్యాక్టరీ యజమానులకు కొమ్ముకాయడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఫుడ్‌పార్కును ఈ ప్రాంతంలో వ్యతిరేకిస్తున్నా టీడీపీ ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చటి పొలాల మధ్య కెమికల్స్ కలిగిన ఫ్యాక్టరీ పెట్టేందుకు అధికారులు సైతం వంతపాడటం దారుణమన్నారు. ఎమ్మెల్యే స్థలాల్లో ఇటువంటి ఫుడ్‌పార్కు ఫ్యాక్టరీని కట్టుకోవాలని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీ యజమానుల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ మొత్తంలో నగదు లాబీయింగ్ చేసుకుని వారికి కొమ్ముకాయడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఫ్యాక్టరీ వద్దని శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా నిర్మాణ పనులు ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మమ్మల్ని వ్యతిరేకించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసినా ఏదో రూపంలో నిరసనలు చేసి ఫ్యాక్టరీ ఉత్పత్తులను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో చీడే నాగమణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లిలా!
భీమవరం : జనావాసాలను ఆనుకుని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య పచ్చటి పొలాల్లో విషం చిమ్మే గోదావరి మెగా ఆక్వా పార్క్ నిర్మిస్తుండటాన్ని మూడేళ్లుగా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అధికారమే అండగా చెలరేగిపోతూ, దమనకాండకు పాల్పడుతున్న ప్రభుత్వం.. ప్రజలను చల్లార్చాల్సింది పోయి పుండుమీద కారం చల్లినట్టుగా వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ‘ఇందేం దారుణమయ్యా’ అని అడిగిన వాళ్లపై అరాచకానికి తెగబడుతోంది. ఇంటింటికీ పోలీసుల్ని పంపించి భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మగవాళ్లను ఊళ్లో ఉండనివ్వకుండా తరిమేస్తోంది. ఇంటి తలుపులు తీసుకుని బయటకొచ్చే మహిళల్ని, చిన్నారులను సైతం పోలీస్ జీపుల్లో కుక్కి ఠాణాలకు తీసుకెళ్లి బండబూతులు తిట్టిస్తోంది. తమ కష్టాలను చెప్పుకుందామని వెళితే.. ప్రజాప్రతినిధులు మొహం చాటేస్తున్నారు. అధికారులకు గోడు వెళ్లబోసుకుందామంటే మాట వినడం లేదు. ప్రభుత్వానికి విజ్ఞాపనలు పం పిస్తే ఎదురు దాడికి దిగుతోంది. ఇలాం టి పరిస్థితుల నడుమ అక్కడి సామాన్య జనం విసిగిపోయారు. పోరాటమే శరణ్యమంటూ ఉద్యమబాట పట్టారు. ఏడాదిన్నర క్రితం సాదాసీదాగా మొదలైన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వ దమనకాండ కారణంగా ఉధృతరూపం దాల్చింది. ఇది చివరకు సమరశీల (మిలిటెంట్) పోరాటానికి దారి తీస్తుందేమో అనే ఆందోళన కలిగి స్తోంది. ఉద్యమం చల్లారాలంటే ప్రజ లకు నచ్చచెప్పి.. వారిని ఒప్పించి నిర్మా ణ పనులకు మార్గం సుగమం చేయాలి. కానిపక్షంలో అక్కడి సామాన్యులు సైతం కోరుతున్నట్టు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించడం తప్ప మరో మార్గం లేదు. ఈ రెండు విషయాలను ఇటు ప్రజాప్రతి నిధులు, అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కీలకంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం మొహం చాటేయగా, శాంతిభద్రతల సమస్యగా చూపిస్తూ పోలీస్ యంత్రాంగం భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మొత్తంగా సమస్యను పరిష్కరించడం మానేసి పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళుతోంది. ప్లేటు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తుందుర్రు సమీపంలోని 40 గ్రామాలు కాలుష్యం బారినపడతాయని.. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని.. పంట పొలాలు నాశనమవుతాయని సుమారు మూడేళ్లుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏడాది క్రితం వరకూ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనంతరం ప్లేటు ఫిరాయించారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎటువంటి నష్టం కలగదంటూ యాజమాన్యానికి వంత పాడారు. ఇదిలావుంటే.. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నోరు విప్పటం లేదు. ఈ నేపథ్యంలో సమస్యను బాధిత గ్రామాల ప్రజలు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి నివాసంలో బాధితులతో సమావేశమై ప్రజల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళతానని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పితాని సత్యనారాయణ ఆనక మొహం చాటేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడులను జన్మభూమి గ్రామసభలకు సైతం రానివ్వకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధుల్లో ఎటువంటి స్పందన కానరావడం లేదు. అధికారుల వైఫల్యం సమస్యను పరిష్కరించే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం ఈ అంశాన్ని గాలికొదిలేశారు. ఆక్వా పార్క్ వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్న అధికారులు ఆ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లకుండా భీమవరంలో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థ జలాలు బయటకు రావని, ఆ నీటిని వినియోగించడానికి ఎక్కువ విస్తీర్ణంలో యాజమాన్యం మొక్కలు పెంచుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత కలుషిత జలాలను సముద్రంలో కలిపే విధంగా ప్రజాధనంతో పైప్‌లైన్ నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని ప్రభుత్వం, యాజమాన్యం చెప్పినదంతా బూటకమేనని నిర్థారణకు వచ్చిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాన్ని అడ్డుకుని తీరతామని భీష్మించారు. తమపై కేసులు బనాయించి జైళ్లపాలు చేసినా వెనక్కి మళ్లేది లేదని.. ప్రజలపై ఉక్కుపాదం మోపి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసినా.. భవిష్యత్‌లో దాని ఉనికికే ప్రమాదమని బాధిత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. -
ఎంపీ వ్యాఖ్యలపై ఎగసిన నిరసన
భీమవరం : గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా రెండున్నరేళ్లుగా 40 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తుంటే పట్టించుకోని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఈ పరిశ్రమవల్ల ఎటువంటి కాలుష్యం ఉండదని చెప్పడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని ఫుడ్‌పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. భీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో పోరాట కమిటీ నాయకులు మాట్లాడారు. పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు మాట్లాడుతూ భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న ఆక్వాపార్క్ కారణంగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలతో సహా 40 గ్రామాలు కాలుష్యం బారినపడి ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారన్నా రు. ఫ్యాక్టరీలో కలుషిత జలాలు గొంతేరు డ్రెయి¯ŒSలో కలవడం వల్ల నీరు కలుషితమై వరి, రొయ్యలు, చేపలు సాగుచేసే రైతులతో పాటు చేపలవేట సాగించే మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ గురించి, ప్రజల ఇబ్బందుల గురించి ఏమీ తెలియని ఎంపీ గంగరాజు ఏకపక్షంగా మాట్లాడటం దారుణమని చెప్పారు. ఎంపీ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని పోరాట కమిటీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమను తరలించాలి త్రిమూర్తులు మాట్లాడుతూ వేండ్రలోని ఎంపీ గంగరాజు డెల్టాపేపర్ మిల్లు కారణంగా యనమదుర్రు డ్రెయి¯ŒS కాలుష్యం బారిన పడగా గంగరాజు మాత్రం కాలుష్యం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణం ఆక్వా పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేశారు. దళితుల మధ్య చిచ్చు జొన్నలగరువు గ్రామానికి చెందిన తాడి దానియేలు మాట్లాడుతూ దళితుల్లో చిచ్చుపెట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలర్పించి అయినా ఫ్యాక్టరీని అడ్డుకుంటామని చెప్పారు. యర్రంశెట్టి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. దిష్టిబొమ్మ దహనం భీమవరం ప్రకాశంచౌక్‌లో ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎంపీ గంగరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి దిష్టిబొమ్మతో ప్రదర్శనగా ప్రకాశంచౌక్కు చేరుకుని ఎంపీకి వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశా రు. ప్రజల ఓట్లతో గెలిచిన గంగరాజు ఫ్యాక్టరీ ఎక్కడ కడుతున్నారో కూడా తెలుసుకోకుండా పరిశ్రమ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటం దారుణమని, తక్షణం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
సీఎం చెంతకు ససేమిరా
భీమవరం : అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధపడతామే తప్ప.. ఎట్టిపరిస్థితుల్లో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి అంగీకరించేది లేదని పోరాట కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆక్వా పార్క్ నిర్మి ంచడం తమకూ ఇష్టం లేదని భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు స్వరం మార్చగా.. పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తామని ఆచంట ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళదామని ప్రతిపాదించగా.. సీఎం చెంతకు వచ్చేది లేదంటూ పోరాట కమిటీ నాయకులు తెగేసి చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గృహంలో ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులతో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), బండారు మాధవనాయుడు, నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ సోమవారం భేటీ అయి చర్చలు జరిపారు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల నుంచి పోరాట కమిటీ ప్రతినిధులు సుమారు 100 మంది హాజరయ్యారు. సీతారామలక్ష్మి ఇంటిచుట్టూ మోహరించిన పోలీసులు పోరాట కమిటీకి చెందిన కొందరు నాయకులతో మాత్రమే ఎమ్మెల్యేలు మాట్లాడతారని, వారు మాత్రమే లోపలికి రావాలని చెప్పారు. దీనిని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరేం మాట్లాడినా అందరి సమక్షంలో మాట్లాడాలని, లేకుంటే తాము చర్చలకు వచ్చేది లేదని భీష్మించారు. దీంతో చేసేదిలేక వచ్చిన వారందరినీ పిలిచి చర్చించారు. మా శవాలపై కట్టుకోండి ముందుగా వివిధ గ్రామాలకు చెందిన 12 మంది పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ శవాలపై కట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఎటువంటి కాలుష్యం ఉండదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే కొన్ని పరిశ్రమల వల్ల యనమదుర్రు డ్రెయి¯ŒS పూర్తిగా కలుషితమై అనేక గ్రామాల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, రావులపాలెం మండలం ఈతకోట, నెల్లూరు జిల్లాలో గల రొయ్యల ఫ్యాక్టరీల్లో అమోనియా గ్యాస్ లీకై వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఉద్యమకారులు వివరించారు. వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రెండున్నరేళ్లుగా ఉద్యమం చేస్తుంటే.. మొదట్లో తమకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడు ఆ తరువాత ఎందుకు మాట మార్చారని నిలదీర్చారు. స్వరం మార్చిన ఎమ్మెల్యేలు ఉద్యమకారులతో భేటీలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు స్వరం మార్చారు. నిన్నటివరకు ఫుడ్‌పార్క్ నిర్మాణం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన వారిద్దరూ.. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకోబోమని ఉద్యమకారులతో భేటీలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీ కావాలని తాను కూడా కోరుకోవడం లేదన్నారు. ఆక్వాపార్క్ యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణం విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని, పంచాయతీ తీర్మానం అవసరమైనప్పుడు మాత్రమే తాము గుర్తొచ్చామని చెప్పారు. ప్రజలందరి అభిప్రాయమే తన అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ‘నేనూ వ్యతిరేకించా’ గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం వల్ల తామంతా నష్టపోతామని నరసాపురం నియోజకవర్గంలోని ఎక్కువ గ్రామాల ప్రజలు తనకు చెప్పారని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని అప్పటికప్పుడు ఆదేశించారన్నారు. ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్, కొన్ని పంట కాలువలు కలుషిత కావడం వల్ల తన నియోజకవర్గ ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని మాధవనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల నష్టం కలుగుతుందని తేలితే దానిని తాను కూడా వ్యతిరేకిస్తానని స్వష్టం చేశారు. పనులను తాత్కాలికంగా నిలిపివేయిస్తాం ఆక్వా పార్క్ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయిస్తామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉద్యమకారులతో జరిపిన భేటీలో ప్రకటించారు. గ్రామాల్లో విధించిన 144 సెక్ష¯ŒS ఎత్తివేతకు కృషిచేస్తామన్నారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు ఒక కమిటీగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరిద్దామని ప్రతిపాదించగా, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఎట్టి పరిస్థితిల్లో చంద్రబాబు వద్దకు వచ్చేది లేదని, ప్రజాప్రతినిధులే ఆయనతో మాట్లాడి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయించాలని కోరారు. ‘హైదరాబాద్ నుంచి వైఎస్ జగ¯ŒS వచ్చారు.. మీరు మాత్రం రాలేదు ఆక్వాపార్క్ ఉద్యమకారులపై అక్రమంగా పెట్టిన కేసులు, అరెస్ట్‌లతో భయాందోళనలకు గురైన ప్రజలను ఓదార్చేందుకు, వారిపక్షాన నిలబడేందుకు హైదరాబాద్ నుంచి వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి వచ్చారని, జిల్లాలోనే ఉన్న మీరెందుకు రాలేకపోయారని ఉద్యమకారులు ఎమ్మెల్యేలను నిలదీశారు. తమ గ్రామాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే అంజిబాబు, మాధవనాయుడుకు తీరిక దొరకలేదా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగిన మీరు ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులకు, పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కానే కాదని స్పష్టం చేశారు. అయితే, ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఆక్వా పార్క్‌ను ఎట్టిపరిస్థితుల్లో జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు. -
జగన్ అండ లేకుంటే ప్రభుత్వం పేట్రేగిపోయేది
- జైలు నుంచి విడుదలైన తుందుర్రు ఆక్వా పార్క్ ఉద్యమకారులు - వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు నరసాపురం: కాలుష్య కారకమైన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు చేపట్టిన ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలవకపోతే ప్రభుత్వం మరింత పేట్రేగిపోయేదని ఉద్యమ నాయకులు అన్నారు. ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలంటూ ఉద్యమించిన కారణంగా హత్యాయత్నం నేరంపై 51 రోజుల క్రితం అరెస్టయి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆక్వాపార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మంగళవారం విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో నరసాపురం సబ్‌జైలులో పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు, ముఖ్య నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు, సముద్రాల వెంకటేశ్వరరావు, కలిగితి సుందరరావు, కొయ్యే మహేష్, బెల్లపు సుబ్రహ్మణ్యంలను సబ్‌జైల్ అధికారులు విడుదల చేశారు. భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల్లోని ఆక్వాపార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నరసాపురం సబ్‌జైలు వద్దకు చేరుకుని ఉద్యమ నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైలు నుంచి విడుదలైన నాయకులు మాట్లాడుతూ.. ఆక్వా పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించే వరకు ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఇకనైనా వాస్తవాలు గ్రహించి ప్రజలపక్షాన నిర్ణయం తీసుకోకపోతే గుణపాఠం చెబుతామన్నారు. -
ఆక్వా పార్క్ ఏర్పాటుకు సీఎం సుముఖం
నరసాపురం : తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి సుముఖంగా ఉన్నారని నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం, ఇతర విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్ పార్కు విషయంలో జరుగుతున్న ఆందోళనలు, లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మధుసూదనరావు, మత్స్యశాఖ ఏడీ పి.రామ్మోహన్రావు, ఆంధ్రా యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఫ్రొఫెసర్ ఎస్.సందీప్‌లను నియమించినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారని చెప్పారు. ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి హానికరమైన వ్యర్థాలు వెలువడవని సబ్‌కలెక్టర్ వివరించారు. అది ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించిందన్నారు. వ్యర్థాలను పైప్లైన్ల ద్వారా సముద్రంలో కలపడానికి యాజమాన్యం అంగీకరించందిన్నారు. రూ.11 కోట్లతో పైప్లైన్లు నిర్మించనున్నారని సబ్ కలెక్టర్ చెప్పారు. ప్రత్యక్షంగా ఫ్యాక్టరీ ద్వారా 2 వేల మందికి, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంట్‌గా అందిస్తుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలకు ఈ విషయాలను చెప్పి ఒప్పిస్తామని తెలిపారు. -
‘ఆక్వా పార్క్’పై కమిటీ
నరసాపురం అర్బన్ : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ నిర్మాణంపై ప్రజల నుం చి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక కమిటీని నియమించనున్నట్టు నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ చెప్పారు. పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వేలాదిమంది ప్రజలు ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతంలో ఆందోళనకు దిగటం, వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం వంటి పరి ణామాల నేపథ్యంలో పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, పార్క్ యాజ మాన్య ప్రతినిధులతో శనివారం సబ్ కలెక్టర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆక్వా పార్క్ విషయంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోరాట కమిటీ తరఫున సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, భీమవరం డివిజన్ కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, నాయకులు కవురు పెద్దిరాజు, ఎం.త్రిమూర్తులు, తుందుర్రు, కంసాల బేతపూడి గ్రామాల పెద్దలు కొత్తపల్లి విశ్వనాథం, ఎస్.వెంకటేశ్వరరావు, చీడే మధు తదితరులు చర్చలకు హాజరయ్యారు. తుందుర్రులో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు, ఉద్రిక్తతకు దారితీసిన కారణాలను సబ్ కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీపీఎం కార్యదర్శి బలరామ్ మాట్లాడుతూ ఆక్వాపార్క్ యాజ మాన్యం దుందుడుకు చర్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఆక్వా పార్క్ నిర్మిస్తే పంట పొలాలు నాశనమవుతాయని, మత్స్యకారులు జీవనోఫాది కోల్పోతారని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా పార్క్ నిర్మాణం సాగుతోందన్నారు. యాజమాన్యం చెబుతున్న విషయాల్లో ఏ మాత్రం వాస్తవం లేదని వివరించారు. అక్కడ ఆక్వా పార్క్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. నాలుగు మండలాల ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇంతకుమించి రెండో మాట లేదని తెగేసి చెప్పారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ దీనిపై ఓ కమిటీని నియమించి సమస్యను పరిష్కరిద్దామని ప్రతిపాదించగా, ఆలోచించి తమ నిర్ణయం చెబుతామన్న పోరాట కమిటీ ప్రతినిధులు చర్చలు ముగించి రాత్రి 9.30 గంటలకు బయటకు వచ్చారు. ఇదిలావుండగా, ఆక్వాపార్క్ యాజమాన్యం తరఫున ముగ్గురు ప్రతినిధులు ఉదయం సబ్ కలెక్టర్‌ను కలిశారు. అన్ని అనుమతులతో, నిబంధనలకు లోబడి తాము ఆక్వాపార్క్ నిర్మిస్తున్నామన్నారు. పనులకు ఆటం కం లేకుండా చూడాలని కోరారు. ఇరువర్గాలతో చర్చిం చిన అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ నియమిస్తామని చెప్పారు. అందులో ఇద్దరు గ్రామస్తులు, ముగ్గురు నిపుణులు ఉండేలా చూస్తామన్నారు. వారిచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. -
పల్లె జనంపై పచ్చ దందా
తుందుర్రులో ఆక్వా పార్క్ కుట్రకు సూత్రధారులెవరో! అమాయక ప్రజల రక్తం చిందినా నోరు మెదపని ఎమ్మెల్యేలు సిసలైన ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం మోపమన్నది ఎవరు పచ్చని పొలాలతో ప్రశాంతంగా ఉంటే డెల్టా ప్రాంతంలో అమాయక పల్లె ప్రజల రక్తం చిందినా.. జిల్లాలోని ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు నోరు మెదపడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా చిన్నాపెద్దా, ఆడ, మగా, ముసలి, ముతక తేడా లేకుండా వేలాది మంది రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా అధికార పార్టీకి చెందిన ఒక్క నాయకుడైనా వారివెంట ఎందుకు నడవటం లేదు. కనీసం ఒక్కరైనా ముందుకొచ్చి ఎందుకు సమాధానం చెప్పడం లేదు. జిల్లా ప్రజలను తొలిచివేస్తున్న ప్రశ్నలివి. జిల్లాను అట్టుడికిస్తున్న భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యవహారం వెనుక ‘పచ్చ’ నేతల హస్తం ఉందన్న అనుమానాలు టీడీపీ ప్రజాప్రతినిధుల మౌనంతో మరింత బలపడుతున్నాయి. ఆక్వా పార్క్‌తో కలిగే విపరిణామాల వల్ల తుందుర్రు సమీప గ్రామాలన్నీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంటాయనేది అక్కడి ప్రజలను ఆందోళన. రొయ్యలు, చేపలను శుభ్రం చేసేందుకు టన్నులకొద్దీ ఉపయోగించే అమోనియాతోపాటు, ఇతర రసాయనాలు, వ్యర్థాలు తమ ప్రాంతంలోని జలా ల్ని, భూముల్ని కలుషితం చేస్తాయని వారంతా భయపడుతున్నారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. జనావాసాలు, పంట పొలా లు, జల వనరులకు దూరంగా నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. ఈ నిర్మాణం ఏడాదిన్నర కాలంగా తుందుర్రు, బొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలతోపాటు చుట్టుపక్కల పది ఊళ్లకు చెందిన రైతులు, మత్స్యకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడూ ప్రశాం తంగా, సోదర భావంతో మెలిగే ఆ గ్రామాల ప్రజలు ఈ మధ్యకాలంలో ఉద్యమబాట పట్టారు. జనావాసాలు, పంట భూములు లేని వేరే ప్రాంతానికి దీనిని తరలించాలని కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయపరమైన పల్లె ప్రజల డిమాండ్లు అరణ్యరోదనగానే మిగిలాయి. వారి ఆవేదనను, ఆందోళనను, ఆక్రోశాన్ని ఎవ రూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, వారితో చర్చించడం, ఆక్వా పరిశ్రమ లాభనష్టాలపై వారికి అవగాహన కల్పించడం లాంటి చర్యలు ఎవరూ చేపట్టలేదు. ‘మాటల్లేవ్.. మాట్లాడుకోవడాలు అంతకన్నా లేవ్’ అన్నట్టుగా ఆక్వా పార్క్ నిర్మాణ పనులు శరవేగంగా సాగిపోతూనే ఉన్నాయి. దీంతో ప్రజల ఆవేదన ఆగ్రహంగా మారింది. డెల్టా ప్రాంతంలో ఎన్నడూ లేని ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. ఉపాధిని ఎరగా చూపుతూ.. ఉపాధిని ఎరగా చూపించి మెగా ఆక్వాఫుడ్ పార్క్ పేరిట కోట్లాది రూపాయల్ని స్వాహా చేసేందుకు కొందరు పెద్దలు పథకం పన్నారన్న ఆరోపణలున్నాయి. ప్రాసెసింగ్ చేసిన ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం భారీగా వస్తుందని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రాజెక్ట్ బాధ్యులతోపాటు టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే పచ్చని పొలాలను, వ్యవసాయాన్ని, మత్స్యకారుల ఉపాధిని నాశనం చేసే ఉపాధి మాకొద్దంటూ ప్రజలు మొత్తుకుంటున్నా వినే నాథుడే కనిపించడం లేదు. మూడు పంటలు పండే పొలాల మధ్య ఆక్వా పార్కుకు అనుమతులు రావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పథకం ప్రకారం ముందుగానే ఇక్కడి పొలాలను కొనుగోలు చేసి పంటలు వేయనివ్వకుండా బీడు భూములుగా చూపించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలకు చెందిన కొందరి భూములను 2012లోనే ఆక్వా పార్క్ ప్రతినిధులు కొనుగోలు చేశారు. వాటిని బీడు భూములుగా మార్చారు. అనంతరం 2014లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎకరం రూ.10 లక్షలు, రూ.12 లక్షలకే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ పత్రాల్లో మాత్రం ఎకరం రూ.40 లక్షలకు కొనుగోలు చేసినట్టు చూపించారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇక భౌగౌళిక సమాచారం కూడా తప్పుల తడకగా చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. తుందుర్రు నుంచి కాకినాడ పోర్టుకు 120 కిలోమీటర్ల దూరం ఉంటే, కేవలం 30 కిలోమీటర్లు మాత్రమేనని, మొగల్తూరు బైపాస్ రోడ్డు 15 కిలోమీటర్లు పైనే ఉంటే, 4 కిలోమీటర్లే అని నివేదికలో పేర్కొని అడ్డగోలుగా అనుమతులు పొందారని అంటున్నారు. మరోవైపు పార్క్ నిర్మాణ ప్రాంతంలో బీడు భూములు తప్ప ఇళ్లు లేవని చూపించి పర్యావరణ అనుమతులు పొందారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆక్వా పార్క్ అనుమతి కోసం కేంద్రానికి సమర్పించిన డాక్యుమెంట్లను బహిర్గతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ‘పచ్చ’ నేతలకూ వాటా ప్రాజెక్టు బాధ్యులుగా ఆనంద్ గ్రూప్స్ చెందిన పారిశ్రామిక వేత్తలే తెరపైకి కనిపిస్తున్నా.. వెనుక మాత్రం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఓ కీలక యువ నేత ఉన్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌కు 2014 ఎన్నికలకు ముందే బీజం పడినప్పటికీ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు. అందుకే పర్యావరణ అనుమతుల నుంచి, బ్యాంకు రుణాల వరకూ కీలక పనులు చకాచకా జరిగిపోయాయి. జిల్లాకు చెందిన చెందిన ఓ ప్రజాప్రతినిధికి నేరుగా వాటాతోపాటు టీడీపీలో ఇప్పుడు చక్రం తిప్పుకున్న ఓ కీలక యువనేత భాగస్వామ్యం ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. లేదంటే ప్రశాంతంగా ఉండే పశ్చిమ పల్లెలు అట్టుడికిపోతున్నా, తీరప్రాంత అమాయక ప్రజలు లాఠీదెబ్బలకు వెరవక ఆందోళన చేస్తున్నా జిల్లాలోని ప్రజాప్రతినిధులెవరూ నోరు మెదపకపోవడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. -
మరో 2 మెగా ఫుడ్ పార్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, సీమాంధ్ర రైతులకు శుభవార్త. చిత్తూరులో శ్రీని ఫుడ్ పార్కు విజయవంతం కావడంతో మరో రెండు మెగా ఫుడ్ పార్కులకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్కులు వచ్చే ఏడాది కార్యరూపం దాల్చనున్నాయని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. అసోచాం ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నిజామాబాద్‌కు సమీపంలో, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. వీటి ద్వారా తెలంగాణలో వరి, మొక్కజొన్న, పసుపు, సోయా రైతులకు, ఆంధ్ర ప్రాంతంలోని చేపలు, రొయ్యల పెంపకందారులకు మేలు జరుగుతుందని అన్నారు. ఉపాధి అవకాశాలు: మొక్కజొన్నతో అటుకులు, ఇథనాల్, దాణా, పిండి వంటి 14 రకాల ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ రూ.60 కోట్లతో నిజామాబాద్ పార్కులో రానుంది. డెయిరీ యూనిట్‌కు రూ.30 కోట్లు, పసుపు ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.15 కోట్లు వ్యయం చేస్తున్నారు. అయిదేళ్లలో 15 పరిశ్రమలు, రూ.500 కోట్ల పెట్టుబడులు రావొచ్చని స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ డెరైక్టర్ పటలోల్ల మోహన్ తెలిపారు. పార్కు పూర్తయితే 3,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.370 ఎకరాలకుగాను 120 ఎకరాల్లో పార్కు రానుందని, మిగిలిన స్థలంలో వ్యవసాయోత్పత్తుల యూనిట్లు వస్తాయన్నారు. తెలంగాణకు చెందిన ఎన్నారైలు పైల మల్లారెడ్డి, రమేశ్ కంభం, పటలోల్ల మోహన్ ప్రధాన ప్రమోటర్లు. మౌలిక వసతులకయ్యే రూ.120 కోట్ల వ్యయంలో ప్రమోటర్లు రూ.70 కోట్లు, కేంద్రం రూ.50 కోట్లు సమకూరుస్తోంది. 2015 చివరకు నిర్మాణం పూర్తవుతుంది. రెడీ టు ఈట్: భీమవరం సమీపంలో ఏర్పాటవుతున్న మెగా ఫుడ్ పార్కులో రొయ్యలు, చేపల ప్రాసెంగ్ చేపడతారు. రెడీ టు ఈట్ ఉత్పత్తులు కూడా తయారు చేస్తారు. అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వీటిని ఎగుమతి చేస్తారు. ఆనంద గ్రూపు నేతృత్వంలో మొత్తం అయిదు కంపెనీలు పార్కును ప్రమోట్ చేస్తున్నాయి. 55 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ పార్కుకు మౌలిక వసతులకు రూ.125 కోట్లు వ్యయం చేస్తున్నారు. కేంద్రం రూ.50 కోట్లు సమకూర్చింది. 30 కంపెనీలు ఇక్కడ యూనిట్లు పెట్టే అవకాశం ఉంది. రూ.800 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్టు ఆనంద గ్రూపు వైస్ ప్రెసిడెంట్ యు.జోగి ఆనంద్ వర్మ తెలిపారు. పార్కు ద్వారా 2,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. సింగిల్ విండో మేలు: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు 15-20 అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. 150 మందికిపైగా అధికారులు ప్రతిపాదన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఇదంతా సమయం వృథా. సింగిల్ విండో క్లియరెన్సుల విధానమే పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ స్పష్టం చేశారు. ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తోంది. అయితే చాలా యూనిట్లు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాయని, తెలంగాణలో మరింత కృషి జరగాలన్నారు. అనుమతుల ప్రక్రియే పెద్ద అడ్డంకి అని హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగంగా గుర్తించినప్పుడే ఫుడ్ ప్రాసెసింగ్ కొత్త పుంతలు తొక్కుతుందని అసోచాం దక్షిణ ప్రాంత చైర్మన్ సన్నారెడ్డి తెలిపారు.