ఆ ఇద్దరి ఎమ్మెల్యేల తీరు దారుణం
ఆ ఇద్దరి ఎమ్మెల్యేల తీరు దారుణం
Published Sat, Mar 11 2017 2:00 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM
భీమవరం అర్బన్ : మా ఓట్లతో గెలుపొంది, మా సమస్యలను పరిష్కరించాల్సిన నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పులపర్తి రామాంజనేయులు గోదావరి ఫుడ్‌పార్కుసై మాట మార్చడం దారుణమని ఫ్యాక్టరీ బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామంలో శుక్రవారం ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ, మహిళలు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదిన ప్రపంచం మొత్తం మహిళల హక్కులను, మహిళల గౌరవ మర్యాదలను కీర్తిస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తుందుర్రులో మహిళలపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఫ్యాక్టరీ యజమానులకు కొమ్ముకాయడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఫుడ్‌పార్కును ఈ ప్రాంతంలో వ్యతిరేకిస్తున్నా టీడీపీ ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చటి పొలాల మధ్య కెమికల్స్ కలిగిన ఫ్యాక్టరీ పెట్టేందుకు అధికారులు సైతం వంతపాడటం దారుణమన్నారు. ఎమ్మెల్యే స్థలాల్లో ఇటువంటి ఫుడ్‌పార్కు ఫ్యాక్టరీని కట్టుకోవాలని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీ యజమానుల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ మొత్తంలో నగదు లాబీయింగ్ చేసుకుని వారికి కొమ్ముకాయడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఫ్యాక్టరీ వద్దని శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా నిర్మాణ పనులు ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మమ్మల్ని వ్యతిరేకించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసినా ఏదో రూపంలో నిరసనలు చేసి ఫ్యాక్టరీ ఉత్పత్తులను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో చీడే నాగమణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement