రాష్ట్రంలో ఆటవిక పాలన
రాష్ట్రంలో ఆటవిక పాలన
Published Tue, Jul 25 2017 1:38 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
నరసాపురం : రాష్ట్రంలో చంద్రబాబునాయుడి ఆటవిక పాలన సాగుతోందని చెప్పడానికి తుందుర్రు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. సోమవారం నాని ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ అనుభవిస్తున్న తుందుర్రు గోదావరి ఆక్వాఫుడ్‌పార్కు ఉద్యమకారులను పరామర్శించారు. జైలులో ఉన్న 22 మంది ఉద్యమకారులతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన నాని అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. కాలుష్య కారకమైన ఫ్యాక్టరీ ఇళ్ల మధ్య కట్టడం వల్ల తమ ఉపాధి పోతుంది, ఆరోగ్యాలకు ముప్పు కలుగుతుందని రెండేళ్లుగా 40 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తుంటే వారిపై తప్పుడు కేసులు పెట్టించి జైళ్లకు పంపడం దారుణమన్నారు. ప్రభుత్వం మాది, అధికారంలో ఉన్నాము కాబట్టి మా మాటే వినాలి అనే నియంతృత్వ ధోరణితో టీడీపీ సర్కారు వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమేనన్నారు. రెండు సార్లు కలిసిన తుందుర్రు ఆక్వాపార్కు బాధితుల పట్ల ముఖ్యమంత్రి కర్కశంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే తుందుర్రు రొయ్యల ఫ్యాక్టరీకి కాపలా దారుడిగా, గుత్తేదారుడిగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. లేకపోతే పాత కేసులు తిరగతోడి జనాన్ని జైళ్లలోకి నెట్టి, వందలమంది పోలీసుల పహారా మధ్య ఫ్యాక్టరీ నిర్మాణ పనులు సాగించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక ఫ్యాక్టరీ విషయంలో ఇంతమంది జనాన్ని ఎందుకు బాధపెడుతున్నారో ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి పితాని సీఎం మెప్పుకోసం పాకులాడుతున్నారు
కార్మిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పితాని సత్యనారాయణ తుందుర్రు ఆక్వాపార్కు విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశించామని నాని పేర్కొన్నారు. అయితే ఆయన తీరు నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేల కంటే అధ్వానంగా ఉందన్నారు. నేనున్నాను..సమస్యను పరిష్కరించేస్తానని మాయమాటలు చెప్పి బాధితులను రెండుసార్లు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. తీరా ముఖ్యమంత్రి బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోగా, సంబంధం లేకుండా జగన్ రెచ్చగొడుతున్నారంటూ పితాని ముందే, బాధితులకు సీఎం చివాట్లు పెట్టడం దారుణమన్నారు. మంత్రి పితాని సీఎం మెప్పుకోసం పాకులాడుతున్నారే తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో విషవాయువులు చిమ్మి ఐదుగురు ప్రాణాలు విడిచినప్పడు మంత్రి పితాని కమిటీ వేస్తానన్నారని చెప్పారు. తుందుర్రు ఫ్యాక్టరీ విషయంలో కూడా కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు. మంత్రి ప్రకటనలను వైఎస్సార్ సీపీ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఆ మాటలన్నీ ఏమైపోయాయో, ముఖ్యమంత్రి వద్దకు బాధితులను తీసుకెళ్లి ఏం ఒరగబెట్టారో కూడా మంత్రి పితాని
చెప్పాలన్నారు.
బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన నేతలు
వైఎస్సార్ సీపీ నాయకుల బృందం సబ్‌జైలుకు వచ్చే సమయంలో జైలులో ఉన్న వారి కుటుంబ సభ్యులు అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్నారు. మహిళలు పిల్లలతో సహా వచ్చి జైలులో ఉన్న తమ వారిని కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఆళ్ల నాని, పార్టీ ఇతర నాయకులు ముందుగా వారితో మాట్లాడారు. లక్కు వరలక్ష్మి తన ఇద్దరు చిన్నారులు అవినాష్, దిలీప్‌లతో కలసివచ్చి జైలు బయట కూర్చుని ఉంది. తన భర్త రామకృష్ణను జైలులో పెట్టారని నాన్న కావాలని ఏడుస్తుంటే, చూపిద్దామని జైలుకు తీసుకొచ్చానని వరలక్ష్మి రోదిస్తూ నాని ముందు వాపోయింది. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆమెకు, ఇదే తరహాలో జైలువద్దకు వచ్చిన మరికొంత మందికి ధైర్యం చెప్పారు. తుదివరకూ పోరాడుదామని, ఈ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని నచ్చజెప్పారు. నరసాపురం, భీమవరం మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు గుణ్ణం నాగబాబు, కవురు శ్రీనివాస్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సాయిబాలపద్మ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement