నిరాహార దీక్ష విరమించిన ప్రసాదరాజు
నరసాపురం: తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో వైఎస్‌ఆర్ సీపీ నరసాపురం నియోజకవర్గ నమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. పార్టీ నేతలు ఆళ్లనాని, అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.
అంతకు ముందు వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ తుందుర్రు ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ తీర ప్రాంతానికి తరలే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆక్వా ఫుడ్‌ను నిరసిస్తూ ప్రసాదరాజు చేపట్టిన దీక్షకు అంబటితోపాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, పాతపాటి సర్రాజులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో అంబటి మాట్లాడుతూ 30 టన్నుల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో అయిదుగురు చనిపోతే 3000 టన్నుల సామర్ద్యంతో నిర్మిస్తున్న తుందుర్రు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ఎంత నష్టమో తలుచుకుంటేనే ఆందోళన కలిగిస్తోందన్నారు. రెండేళ్ల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఉండదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలుసుకోవాలన్నారు.
గతంలో పరిపాలించిన తొమ్మిదేళ్ల చంద్రబాబుకు నేటి బాబుకు చాలా తేడా ఉందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టాలని ఆలోచన చేయడం దుర్మార్గమని విమర్శించారు. రెండేళ్ల తర్వాత వైఎస్ జగన్ వస్తారు...ఫ్యాక్టరీని తీర ప్రాంతానికి తరలిస్తాం అని అంబటి చెప్పారు.