గత ఎన్నికల్లో తాను రూ11.50 కోట్లు ఖర్చుచేసినట్లుగా సత్తెనపల్లి శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నందున ..
నరసరావుపేట: గత ఎన్నికల్లో తాను రూ.11.50 కోట్లు ఖర్చుచేసినట్లుగా సత్తెనపల్లి శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నందున ఎన్నికల కమిషన్ సుమోటోగా అతనిపై ఒకటీ రెండురోజుల్లో చర్యలు తీసుకోకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని వేచిచూస్తున్నాం. మరో రెండు రోజులు చూస్తాం. సుమోటోగా తీసుకొని విచారించకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామన్నారు. అప్పటికీ చర్యలు చేపట్టకపోతే న్యాయపరంగా వైఎస్సార్ సీపీ తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఉన్న వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా రూ.11.50 కోట్లు ఖర్చుపెట్టానన్న తర్వాత కూడా శాసనసభ్యుడిగా, స్పీకర్‌గా పనికి వస్తారా అనే విషయం ప్రజలు గమనించాలన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.