ఎన్నాళ్లిలా! | ENNALLILAA! | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లిలా!

Published Sat, Mar 11 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

ఎన్నాళ్లిలా!

ఎన్నాళ్లిలా!

భీమవరం : జనావాసాలను ఆనుకుని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య పచ్చటి పొలాల్లో విషం చిమ్మే గోదావరి మెగా ఆక్వా పార్క్‌ నిర్మిస్తుండటాన్ని మూడేళ్లుగా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అధికారమే అండగా చెలరేగిపోతూ, దమనకాండకు పాల్పడుతున్న ప్రభుత్వం.. ప్రజలను చల్లార్చాల్సింది పోయి పుండుమీద కారం చల్లినట్టుగా వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ‘ఇందేం దారుణమయ్యా’ అని అడిగిన వాళ్లపై అరాచకానికి తెగబడుతోంది. ఇంటింటికీ పోలీసుల్ని పంపించి భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మగవాళ్లను ఊళ్లో ఉండనివ్వకుండా తరిమేస్తోంది. ఇంటి తలుపులు తీసుకుని 
బయటకొచ్చే మహిళల్ని, చిన్నారులను సైతం పోలీస్‌ జీపుల్లో కుక్కి ఠాణాలకు తీసుకెళ్లి బండబూతులు తిట్టిస్తోంది. తమ కష్టాలను చెప్పుకుందామని వెళితే.. ప్రజాప్రతినిధులు మొహం చాటేస్తున్నారు. అధికారులకు గోడు వెళ్లబోసుకుందామంటే మాట వినడం లేదు. ప్రభుత్వానికి విజ్ఞాపనలు పం పిస్తే ఎదురు దాడికి దిగుతోంది. ఇలాం టి పరిస్థితుల నడుమ అక్కడి సామాన్య జనం విసిగిపోయారు. పోరాటమే శరణ్యమంటూ ఉద్యమబాట పట్టారు. ఏడాదిన్నర క్రితం సాదాసీదాగా మొదలైన ఆక్వా పార్క్‌ వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వ దమనకాండ కారణంగా ఉధృతరూపం దాల్చింది. ఇది చివరకు సమరశీల (మిలిటెంట్‌) పోరాటానికి దారి తీస్తుందేమో అనే ఆందోళన కలిగి స్తోంది. ఉద్యమం చల్లారాలంటే ప్రజ లకు నచ్చచెప్పి.. వారిని ఒప్పించి నిర్మా ణ పనులకు మార్గం సుగమం చేయాలి. కానిపక్షంలో అక్కడి సామాన్యులు సైతం కోరుతున్నట్టు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించడం తప్ప మరో మార్గం లేదు. ఈ రెండు విషయాలను ఇటు ప్రజాప్రతి నిధులు, అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కీలకంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం మొహం చాటేయగా, శాంతిభద్రతల సమస్యగా చూపిస్తూ పోలీస్‌ యంత్రాంగం భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మొత్తంగా సమస్యను పరిష్కరించడం మానేసి పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళుతోంది. 
 
ప్లేటు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు
ఆక్వా పార్క్‌ నిర్మాణం వల్ల తుందుర్రు సమీపంలోని 40 గ్రామాలు కాలుష్యం బారినపడతాయని.. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని.. పంట పొలాలు నాశనమవుతాయని సుమారు మూడేళ్లుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏడాది క్రితం వరకూ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనంతరం ప్లేటు ఫిరాయించారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎటువంటి నష్టం కలగదంటూ యాజమాన్యానికి వంత పాడారు. ఇదిలావుంటే.. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నోరు విప్పటం లేదు. ఈ నేపథ్యంలో సమస్యను బాధిత గ్రామాల ప్రజలు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి నివాసంలో బాధితులతో సమావేశమై ప్రజల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళతానని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పితాని సత్యనారాయణ ఆనక మొహం చాటేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడులను జన్మభూమి గ్రామసభలకు సైతం రానివ్వకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధుల్లో ఎటువంటి స్పందన కానరావడం లేదు.
 
అధికారుల వైఫల్యం
సమస్యను పరిష్కరించే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం ఈ అంశాన్ని గాలికొదిలేశారు. ఆక్వా పార్క్‌ వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్న అధికారులు ఆ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లకుండా భీమవరంలో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థ జలాలు బయటకు రావని, ఆ నీటిని వినియోగించడానికి ఎక్కువ విస్తీర్ణంలో యాజమాన్యం మొక్కలు పెంచుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత కలుషిత జలాలను సముద్రంలో కలిపే విధంగా ప్రజాధనంతో పైప్‌లైన్‌ నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని ప్రభుత్వం, యాజమాన్యం చెప్పినదంతా బూటకమేనని నిర్థారణకు వచ్చిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాన్ని అడ్డుకుని తీరతామని భీష్మించారు. తమపై కేసులు బనాయించి జైళ్లపాలు చేసినా వెనక్కి మళ్లేది లేదని.. ప్రజలపై ఉక్కుపాదం మోపి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసినా.. భవిష్యత్‌లో దాని ఉనికికే ప్రమాదమని బాధిత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement