ఎన్‌సీసీ డే నిర్వహణకు సన్నాహాలు
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు నగరంలో ఈ నెల 27వ తేదీన ఎన్‌సీసీ డే నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్‌సీసీ కమాండర్ కల్నల్ పత్రి గోపాలకృష్ణ చెప్పారు. శుక్రవారం స్థానిక డాక్టర్స్ కాలనీలోని ఎన్‌సీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌సీసీ డే దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఎ.క్యాంపులోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో కర్నూలు మెడికల్ కాలేజి, కోల్స్ జూనియర్ కళాశాల, కేవీఆర్ డిగ్రీ కళాశాల, సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిల్వర్‌జూబ్లీ ప్రభుత్వ కళాశాల, ఎస్టీబీసీ కళాశాలలకు చెందిన 54 మంది ఎన్‌సీసీ విద్యార్థులతో పాటు ఆర్మీ అధికారులు సైతం రక్తదానం చేశారని తెలిపారు. అలాగే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఆశ్రమం పొందుతున్న వారిని ఎన్‌సీసీ విద్యార్థులు సందర్శించారన్నారు. శనివారం ఉదయం 6.30 గంటలకు గో గ్రీన్, గో క్లీన్ అంటూ కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు టు కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. 27వ తేదిన ఉదయం 11 గంటలకు స్థానిక సిల్వర్‌జూబ్లీ కళాశాల మైదానంలో ఎన్‌సీసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే పెరేడ్‌కు డీఐజి రమణకుమార్, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. అనంతరం సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఎన్‌సీసీ కేడెట్లకు ఏ,బీ,సీ సర్టిఫికెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సమావేశంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ గౌస్‌బేగ్, ఎస్‌ఎన్. ఐథాల్ పాల్గొన్నారు.