కాలేజీ మైదానమే.. వాణిజ్య సముదాయం..
కాలేజీ మైదానమే.. వాణిజ్య సముదాయం..
Published Mon, Feb 6 2017 11:01 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
-విద్యార్థులే వ్యాపారవేత్తలు
–ఆర్ట్స్ కళాశాలలో ‘మెగా మార్కెట్ ఫెస్ట్’
–30 స్టాళ్లతో మూడు రోజులు నిర్వహణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వారు చదివేది వాణిజ్యశాస్త్రం. క్షేత్రస్థాయిలో వివిధ వ్యాపారసంస్థల కార్యకలాపాలను పరిశీలించడమూ వారి కోర్సులో భాగమే కావచ్చు. అయితే రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఓ అడుగు ముందుకేసి తామే వ్యాపారులుగా మారారు. కళాశాల ప్రాంగణమే వారి వ్యాపార సముదాయమైంది. విద్యార్థులకు వ్యాపారదృక్పథాన్ని నేర్పే విధంగా కళాశాల వాణిజ్య, కామర్స్ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మెగా మార్కెట్ ఫెస్ట్’ను సోమవారం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రారంభించారు. మూడురోజులు జరిగే ఈ ఫెస్ట్‌లో ఏమి వ్యాపారం చేయాలో ముగ్గురు నుంచి 10 మందితో ఏర్పడ్డ బృందాలు ముందే నిర్ణయించుకున్నాయి. తలో కొంత సొమ్ము పెట్టుబడి పెట్టి మార్కెట్‌కు వెళ్లి అందుకు అవసరమైన వస్తువులను కొన్నారు. వాటికి ఒక ధర నిర్ణయించి ఫెస్ట్‌లోనిఽ స్టాల్స్‌లో అమ్మకాలు ప్రారంభించారు. ఈ విధంగా 30 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
లాభాలతో శభాష్ అనిపించుకుంటాం..
ఆడవాళ్లకు ఇష్టమైన ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం ఏ ప్రాంతంలో పెట్టినా లాభదాయకంగా ఉంటుందని ఆ వ్యాపారం ఎన్నుకున్నాం. ఏడుగురం రెండేసి వందల చొప్పున వేసుకుని రూ.1400లతో గాజులు, చెవిదిద్దులు, డిజైన్ దండలు, పట్టీల వంటివి హోల్‌సేల్‌గా కొన్నాం. మార్కెట్‌కనుగుణంగా ధర నిర్ణయించి, స్టాల్‌లో అమ్ముతున్నాం. ఇప్పటివరకు రూ.700 వచ్చింది. మిగిలిన రెండు రోజుల్లో కచ్చితంగా లాభాలు తెచ్చి అందరితో శభాష్ అనిపించుకుంటాం.
–టి.భవానీ, మహాలక్ష్మీ, దుర్గాభవాని, పవిత్ర, బీకాం ప్రథమ సంవత్సరం
)మహిళల వస్తువులపై దృíష్టిసారించాం
ప్రతి మహిళా ఫంక్షన్‌కో, బయటకో వెళ్లాలంటే కచ్చితంగా హ్యాండ్‌బ్యాగో, చిన్నపర్సో ఉంటాయి. అందుకే వాలెట్స్ వ్యాపారం బాగుంటుందనిపించింది. 13 మందిమి రూ.13 వేలు కూడబెట్టాం. దానితో సరుకులు కొనుగోలు చేశాం. ముందుగా మార్కెట్‌లో తిరిగి అవగాహన పెంచుకున్నాం. వినియోగదారునికి మొదట కావల్సింది వస్తువులో నాణ్యత. ఆ దిశగా సరుకులు కొన్నాం. నాణ్యత ద్వారా వినియోగదారుల్ని ఆకర్షించవచ్చు.
–యు.గీత, ఎం.లలిత, ఎం.లావణ్య, ఎస్.శిరీష, ఎంకాం విద్యార్థులు
లాభంతో పాటు తృప్తి
ఇటీవల అందరూ ఇళ్లలో మొక్కలను పెంచుతున్నారు. ఆ వ్యాపారం బాగుందని కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్నాం. అందరం కలిసి చర్చించుకున్నాం. అతి తక్కువతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ముగ్గురం కలిసి రూ.1500 తో మొక్కలు కొనుగోలు చేశాం. పెట్టుబడికి రెండింతలు లాభాలు తీసుకువస్తాం. వీటి అమ్మకం వల్ల మాకు లాభాలు, వ్యాపార అవగాహనతో పాటు పర్యావరణ పరిరక్షణలో మేమున్నామనే తృప్తి కూడా మిగులుతుంది.
–భార్గవ్, డి.స్వాతి, ఎస్.పుష్ప, ఎంకాం విద్యార్థులు
నష్టం ప్రసక్తే లేదు..
మార్కెట్‌లో రెడీమెడ్ డ్రెస్‌ల అమ్మకాలు బాగున్నాయన్న ఆలోచనతో వాటిని కొనుగోలు చేసాం. ఇప్పటివరకు రెండు డ్రెస్సులు అమ్మాం. ఈ వ్యాపారంలో ఒక మంచి వి«ధానముందని తెలిసింది. వ్యాపారం చేసేందుకు ముందుగా పెట్టుబడికి రుణమొత్తం అవసరం లేదు. కొంత సొమ్ము ఇస్తే హోల్‌సేల్ వ్యాపారులు మాకు కొంత సరుకు ఇచ్చారు. అమ్మలేనివి తిరిగి ఇవ్వవచ్చన్నారు. ఆ విధానంతో ఆ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉండదనే ఆలోచన వచ్చింది.
–పి.మహేష్, మోహిన్, సాయి, తేజ, బీకాం విద్యార్థులు
అవగాహన లేక నష్టం..
ఆటలు, ఆహారం అనే విధానం కొత్తరకంగా అనిపించింది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు ఆశించవచ్చనుకున్నాం. అయితే ఇది చాలా తెలివితో చేయాల్సిన వ్యాపారమని స్టాల్ పెట్టాక తెలిసింది. ఒక చాక్లెట్ ఇస్తాం..దాన్ని ఒక నిమిషంలో చప్పరించి తినేస్తే ఒక బహుమతి ఇస్తాం. ఎగ్జిబిషన్‌లలో మాత్రమే ఉండే ఈ విధానంపై అవగాహన లేకపోవడంతో తొలిరోజు నష్టం చవిచూశాం. మరో రెండురోజులుంది కాబట్టి దీనిపై అవగాహన పెంచుకుంటాం.
–ఎం.సీత, సుప్రియ, రమ్య, వినయ్, బీకాం విద్యార్థులు
వాస్తవికత తెలుస్తుంది..
విద్యార్థులు పాఠ్యాంశాల్లో నేర్చుకున్నది వేరు. వాస్తవం తెలుసుకోవడానికి మెగా మార్కెట్ ఫెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమ్మకం, నైపుణ్యం, ఖాతాదారులను ఆకట్టుకోవడం వంటివి తెలుసుకుంటారనే దీన్ని ఏర్పాటు చేశాం. దీని ద్వారా విద్యార్థులకు వ్యాపారం అంటే ఎలా ఉంటుందో కళాశాలలోనే అర్థమౌతుంది.
–డాక్టర్ ఆర్.డేవిడ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్
నవకల్పనలు చేయాలి..
మార్కెట్‌లో సృజనాత్మక ఉత్పత్తులు తయారుచేసి ప్రదర్శనకు ఉంచి అమ్మడం ద్వారా ఆ వస్తువు తయారీ, అమ్మకం ధర బేరీజు వేసుకోవచ్చు. రాబోయే కాలంలో నవకల్పనలతో కూడిన వస్తువులు తయారుచేసి అందుబాటులోకి తేవాలి. విద్యార్థులు వ్యాపార మెళకువలు నేర్చుకునేందుకు ఫెస్ట్ దోహదం చేస్తుంది.
–ఆకుల సత్యనారాయణ, నగర ఎమ్మెల్యే
విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి
వ్యాపారం చేయడం ముఖ్యం కాదు. దానినిర్థి దశనుంచే అలవాటు చేసుకోవాలి. అప్పుడే అందులో మెళకువలు తెలుసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీనికోసం విద్యార్థులు ముందుగా అవగాహన పెంపొందించుకోవాలి. ఆ దిశగానే మెగా మార్కెట్ ఫెస్ట్ ఏర్పాటు చేశాం. మంచి ఫలితమిస్తుందని ఆశిస్తున్నాం.
–కె.రత్నమాణిక్యం, మెగా మార్కెట్ ఫెస్ట్ కో ఆర్డినేటర్
Advertisement
Advertisement