కళలతో మనో వికాసం
విజయవాడ కల్చరల్:
భారతీయ సంప్రదాయ కళలలను ప్రపంచానికి చాటిచెప్పాలని నాట్యాచార్యుడు పశుమర్తి కేశవప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, విద్యాభారతి సంస్కృతీ సంస్థాన్ సంయుక్తంగా దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్యకళాశాలలో రెండురోజులుగా నిర్వహిస్తున్న భారతీయ కళల శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. విద్యార్థులు విలువలతో కూడిన జీవితం గడపాలని, దేశ భవిష్యత్ వారిమీదనే ఆధారపడివుందని, కళలు మనోవికాసాన్నిస్తాయని తెలిపారు. విధ్యాభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డీ.లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ భారతీయ కళలు భరతమాత నుదుట సింధూరపు బొట్టుగా అభివర్ణించారు. విజ్ఞానవిహర్ కార్యదర్శి మాట్లాడుతూ రెండురోజుల శిక్షణ శిబిరంలో 25 పాఠశాలలనుంచి 800 బాలబాలికలు పాల్గొన్నారని వివరించారు. పాఠశాల విద్యతోపాటు భారతీయ కళలను బాలబాలికలు అందిపుచ్చేకోవాలని సూచించారు. విద్యాభారతి కోశాధికారి గోవిందరావు భారతీయ సంప్రదాయ విలువలు, కళల గురించి ప్రసంగించారు. శిక్షణ లో పాల్గొన్న బాలబాలికలకు ప్రశంసాపత్రాలను అందించారు. విజ్ఞానవిహార్ విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో మంత్రముగ్ధుల్ని చేశారు.