
ఘాట్ల రహదారులు ఇలా...
అస్తవ్యస్తంగా రోడ్లు సమీపిస్తున్న పుష్కరాలు
నత్తనడకన పనులు
ప్రధాన రహదారి నిర్మాణానికి అడ్డంకులు
భవానీపురం: కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నాయి. స్నాన ఘాట్లకు వెళ్లే రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. గట్టు వెనక ప్రాంతంలోని పున్నమి, మల్లేశ్వరి, భవానీఘాట్‌ల నిర్మాణానికి కార్పొరేషన్ సుమారు రూ.6.60 కోట్లు ప్రతిపాదనలతో, ప్రణాళికలు సిద్ధం చేసింది. పనులు మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాయి. పుష్కరాలకు ఇంకా 29 రోజులే ఉంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయా అనే అనుమానాలు ప్రజలలో రేకెత్తుతున్నాయి.
ఏడు రహదారులు..
భవానీపురం పున్నమి హోటల్ నుంచి భవానీ పురం వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ పంపింగ్ స్కీమ్ వరకు 2.5 కిలోమీటర్ల కరకట్ట ప్రధాన రహదారి నిర్మించాల్సి ఉంది. దానికి అనుబంధంగా ఆరు రహదారులు నిర్మించాలి. ప్రధాన రహదారిని భవానీఘాట్ వరకే పరిమితం చేశారు. వాస్తవానికి ఈ పనులన్నీ ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. పనులు ప్రారంభించిన నెలా పది రోజులకు 40 శాతం మించి కాలేదు. మిగిలిన 60 శాతం పనులు 29 రోజుల్లో ఎలా పూర్తి అవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పుష్కర ఘాట్ల నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్, మట్టిని తీసుకువెళ్లే లారీలు కరకట్ట ప్రధాన రహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రహదారుల నిర్మాణ పనులు మొదలుపెడితే లారీలు తిరిగే అవకాశం ఉండదు.
కరకట్ట ఇళ్లను తొలగిస్తేనే..
ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలంటే కరకట్ట వెంట ఉన్న ఇళ్లను తొలగించాల్సి ఉంది. చాలా వరకు కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సుమారు 70 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ ఇళ్లను తొలగించటం అధికారులకు సాధ్యం కాలేదు. ఫలితంగా స్నానఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కోర్టుకు వెళ్లిన ఇళ్ల యజమానులు ఆందోళనబాట పట్టారు. వారికి అఖిలపక్ష నాయకులు అండగా నిలబడ్డారు. ఆ ఇళ్ల తొల గింపు, గతంలో ఇళ్లను తొలగించిన సమయంలో పగిలిపోయిన పైప్‌లైన్లు మార్చాల్సి ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.