కదం తొక్కిన ఆశ కార్యకర్తలు
► చలో జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఉద్రిక్తం
► కనీస వేతనం చెల్లించాలని డిమాండ్
► 21 మంది కార్యకర్తల అరెస్టు
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమకు రూ. 6వేలు కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు బుధవారం చేపట్టిన ‘చలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం’ ఉద్రిక్తంగా మారింది. ముందుగా ఆశ కార్యకర్తలు పట్టణంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానం నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన కార్యకర్తలను వైద్య ఆరోగ్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా రెండో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేట్లను మూసివేయడంతో కార్యకర్తలు కార్యాలయం ముందు బైఠాయించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వచ్చి వినతి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అశ కార్యకర్తలు ఆందోళన విరమించాలని రెండో పట్టణ సీఐ దాడి మోహనరావు, ఎస్‌ఐ రవికుమార్ కోరారు. కానీ ఎంతకీ విరమించకపోవడంతో పోలీసులు 21 మంది కార్యకర్తలను అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆశ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిపాలనాధికారి డాక్టర్ దవల భాస్కరరావు వచ్చి వినతి పత్రాన్ని అందుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని హమీ ఇచ్చారు. అరెస్టులు చేసిన కార్యకర్తలను పోలీసులు విడుదల చేశారు. కాగా అరెస్టు చేయడంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, మహిళలను ఇబ్బందులు పెట్టారని కార్యకర్తలు ఆరోపించారు.
ప్రభుత్వ వైఖరి దుర్మార్గం
ర్యాలీకి ముందు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. మహిళా సంక్షేమం పేరు చెబుతూ, మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. ఆశ కార్యకర్తలకు తెలంగాణాలో నెలకు రూ. 6 వేలు వేతనం చెల్లిస్తున్నారని, ఆదే విధంగా ఏపీలోనూ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జూలై 3న పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలెక్టరేట్‌ను దిగ్భందిస్తామని వెల్లడించారు. ఆశ కార్యకర్తల శ్రమకు కనీస వేతం కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. వారి సమస్యలు పరిష్కారమయ్యేవరకూ ఉద్యమాలు చేయడానికి సిద్ధమని గోవిందరావు తెలిపారు. ఆశ కార్యకర్తల సంఘం నాయకులు ఎన్. హిమప్రభ, కె.నాగమణి, ఎ సత్యం మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలకు అలవెన్సులివ్వాలని, పని భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.లతాకాంతి, ఎ.మహలక్ష్మి, కె.ఆదిలక్ష్మి, బి.స్వప్న, రామూర్తి, అమ్మన్నాయుడు, కె.ధనలక్ష్మి పాల్గొన్నారు.