
ఒత్తిడితోనే ఏఎస్పీ ఆత్మహత్య
దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. సత్యమంగళంలో కన్నీటి వీడ్కోలు
సాక్షి, విశాఖపట్నం/ సేలం(తమిళనాడు): ‘విధి నిర్వహణలో మూడు నెలలుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాను.. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు..’ అని గురువారం తుపాకీ పేలి మృతి చెందిన విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ తన చివరి లేఖలో పేర్కొన్నారు. లేఖతో పాటు అక్కడ లభించిన ఆధారాలను బట్టి కూడా ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని కేసు విచారణ చేపట్టిన సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు తెలిపారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ ఏఎస్పీ శశికుమార్ తన రివాల్వర్‌తోనే కాల్చుకున్నారని, బయట నుంచి ఎవరో వచ్చి హత్య చేశారనేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
‘మూడు నెలలుగా ఫెయిల్యూర్స్‌తో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నాను.. నేను ఈ డిపార్ట్‌మెంట్‌కు పనికిరాను.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఐయామ్ సారీ’ అని శశికుమార్ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని డీఎస్పీ వెల్లడించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యాకే కచ్చితమైన నిర్ధారణకు రాగలమన్నారు. అయితే ఇది ముమ్మాటికీ హత్య అంటూ శశికుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు.పథకం ప్రకారం శశికుమార్‌ను హత్య చేశారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగాను, అధికారికంగాను కక్ష కట్టిన కొందరు హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, సీబీఐ విచారణకు చర్యలు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా తమిళనాడులోని స్వగ్రామం ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో శుక్రవారం శశికుమార్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.