గల్లంతైన పవన్ మృతదేహం లభ్యం
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టు కుడి అలుగు వరదనీటి ప్రవాహంలో స్థానిక గండికుంట గల్లంతైన అమరగాని పవన్‌కుమార్ (36) మృతదేహం సోమవారం లభ్యమైంది. శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు గల్లంతైన పవన్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం 12:55 గంటలకు మండలంలోని అడ్లూరు చెరువు సమీపంలో వరదనీటి కాల్వలో లభించింది. మృతదేహం గుర్తింపు కోసం మూడు రోజులుగా నల్లగొండ డీఎస్పీ సుధాకర్, ఆర్డీఓ వెంకటాచారి నేతృత్వంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పవన్‌కుమార్ మృతదేహాన్ని గండికుంటకు సుమారు కిలోమీటరు దూరంలో అడ్లూరు చెరువు సమీపంలో కాల్వలోని కంపచెట్ల పొదల్లో గుర్తించారు. కుళ్లిపోయిన మృతదేహాన్ని కర్రల సహాయంతో కాల్వ నుంచి బయటకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసుకురాగానే బాధిత కుటింబీకుల రోదనలు అక్కడకు వచ్చినవారికి కంటతడిపెట్టించాయి.
రెస్క్యూటీం, జాలర్ల సహాయంతో...
మూడు రోజుల క్రితం వరదనీటిలో గల్లంతైన పవన్‌కుమార్ ఆచూకి కోసం సోమవారం నాగార్జునసాగర్‌కు చెందిన రెస్క్యూటీంతో గాలింపు చేపట్టారు. ఆక్సిజన్ మాస్క్‌ల సాయంతో గాలింపు చేపట్టినా మొదట ఫలితం కన్పించలేదు. దీంతో వారికి తోడుగా జాలర్లు, పోలీసులు గాలింపు చేపట్టారు. కాల్వలో వరదనీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భారీ పొక్లెయిన్‌తో కాల్వకు అడ్డుకట్ట వేసి వరదనీటిని పంటపొలాల్లోకి దారి మళ్లించారు. అనంతరం డీఎస్సీ సుధాకర్ నేతృత్వంలో కాల్వలో నిల్వ ఉన్న నాలుగు అడుగుల లోతు నీటిలో గాలింపు చే పట్టారు. కంప చెట్లపొదల్లో ఉన్న పవన్‌కుమార్ మృతదేహాన్ని మొదట డీఎస్పీ గుర్తించి బయటకు తీశారు. వెంటనే పోలీసులు స్థానికులతో కలిసి కర్రల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. నీటిలో నుంచి మృతదేహాన్ని తరలించేందుకు అందుబాటులో ఏమిలేకపోవడంతో డీఎస్పీ తన శరీరంపై ఉన్న రెయిన్‌కోట్‌ను విడిచి అందులో మృతదేహాన్ని కట్టుకుని బయటకు తీసుకువచ్చారు. స్వయంగా డీఎస్సీ ఎంతో సాహసంతో వరదనీటిలో గాలింపు చేపట్టడంతో పాటు మృతదేహాన్ని గుర్తించడం, రెయిన్‌కోట్‌లో మృతదేహాన్ని తరలించి సహాయక చర్యలకు ఆదర్శంగా నిలిచారు.
పరిశీలించిన ఎస్పీ
పవన్‌కుమార్ గల్లంతైన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన తీరు, చేపడుతున్న గాలింపు చర్యలు తదితర విషయాలను డీఎస్పీ సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని, అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి ఎస్పీ సూచించారు. వరద నీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో పోలీసులు వరదనీటి ప్రవాహాన్ని నిరోధించేందుకు గండి కుంట వద్ద కల్వకు అడ్డుగా ఇసుక బస్తాలను వేశారు. అనంతరం భారీ పొక్లెయిన్ సాయంతో కాల్వకు అడ్డుకట్ట వేసి నీటిని పంటపొలాల్లోకి దారిమళ్లించి గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలానికి శాలిగౌరారం, నకిరేకల్, మునగాల మండలాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం జనంతో నిండిపోయింది. గాలింపు చర్యల్లో శాలిగౌరారం, కట్టంగూరు, నార్కట్‌పల్లికి చెందిన పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి.