మెట్టలో అతివృష్టి.. డెల్టాలో అనావృష్టి
మెట్టలో అతివృష్టి.. డెల్టాలో అనావృష్టి
Published Sat, Oct 1 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
–జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం తీరిది
–పది డెల్టా మండలాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదు
–మెట్ట, ఏజెన్సీ మండలాల్లో అత్యధికంగా వర్షాలు
–భారీవర్షాలకు 4,675 ఎకరాల్లో పంటలకు తీరని నష్టం
కొవ్వూరు :
వర్షాకాల సీజన్ ఆరంభ నెలలో అదరగొట్టిన వర్షాలు ఆ తర్వాత రెండు నెలల పాటు దోబూచులాడాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్‌లో జిల్లావ్యాప్తంగా గడిచిన వారం, పదిరోజుల నుంచి భారీవర్షాలు కురిశాయి. జిల్లాలో ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, పెదపాడు, ఆచంట, పెనుమంట్ర, నిడమర్రు, నిడదవోలు, ఇరగవరం మండలాల్లో జూన్ ¯ð ల ఆరంభం నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు 19 శాతం నుంచి 59 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ మండలాలన్నీ డెల్టా ప్రాంత మండలాలే కావడం గమనార్హం. పది మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ పది మండలాలు పూర్తి మెట్ట, ఏజెన్సీ ప్రాంతంలోనివే. కుక్కునూరు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం ఏజెన్సీ మండలాలతో పాటు కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, భీమడోలు, ద్వారకాతిరుమల, టి.నరసాపురం మండలాల్లో జిల్లాలో అత్యధికంగా వర్షపాతం రికార్డంది. ఈ మండలాల్లో 20 శాతం నుంచి 59 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
4,675 ఎకరాల్లో పంటలు వర్షార్పణం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 4,500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జూన్‌లో సాధార ణం కంటే అ«ధికంగా కురిసిన వర్షపాతం జూలై నెలలో 43.1 శాతం, ఆగస్ట్‌లో 51.5 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. సెప్టెంబర్‌లో మూడోవారం వరకు వర్షాలు నామమాత్రంగానే కురిశాయి. గడిచిన వారం, పదిరోజుల్లో కురిసిన వర్షాలతో ఈ నెల సాధారణ వర్షపాతం కంటే 44.2 శాతం అదనంగా వర్షం కురిసింది. ఇదే రైతులు పాలిట శాపంగా మారింది. ప్రధానంగా పది మెట్ట, ఏజెన్సీ ప్రాంత మండలాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలకు తీరనినష్టం వాటిల్లింది. జూలై, ఆగస్ట్ నెలల్లో నీటితడులు సరిగా అందక ఇబ్బందులు పడిన రైతులు సెప్టెంబర్‌లో కురిసిన అకాలవర్షాలతో అతలాకుతలమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం వరి 1,800 ఎకరాలు, మినుము పంట 2,800 ఎకరాలు, వేరుశెనగ 75 ఎకరాల్లో దెబ్బతింది. ఎర్రకాలువ వరద ప్రభావంతో జగన్నాథపురం, సింగవరం, నందమూరు తదితర ప్రాంతాల్లో, కొవ్వాడ కాలువ ప్రభావంతో కొంతమేరకు వరి పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక నివేదికలు అందినట్టు వ్యవసాయ జేడీ సాయిలక్ష్మీశ్వరీ తెలిపారు.
ఆందోళనలో అన్నదాతలు
పశ్చిమ బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా కోస్తా ప్రాంతంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హె చ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ నెల పదో తేదీ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే పలుచోట్ల వరి పంట కోతకు వచ్చింది. ముందస్తుగా నాట్లు వేసిన చోట్ల కోతలు సైతం ప్రారంభించారు. ఈ తరుణంలో వర్షం కురిస్తే పంటలు నేలవాలిపోవడంతో పంటరాలిపోయి తీరని నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement