వేలం ఎత్తులు.. దూసిన కత్తులు!
వేలం ఎత్తులు.. దూసిన కత్తులు!
Published Fri, Mar 24 2017 10:44 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఉలిక్కిపడిన డోన్
- పట్టపగలు టీడీపీ వర్గీయుల అరాచకం
- వేలాలను దక్కించుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై దాడి
- ఐదుగురికి తీవ్ర గాయాలు
- ఒకరి పరిస్థితి విషమం
పట్టుడు కత్తులు.. దడ్డు కర్రలు.. రాడ్లు.. సుమారు 40 మంది వ్యక్తులు. అరుపులు, కేకలతో అటూఇటూ తిరుగుతూ.. ఎదుటి వ్యక్తుల తలలు పగులగొడుతూ, కత్తులు దూస్తున్న భీతావహ దృశ్యంతో డోన్ పట్టణంలోని పాతపేట పీర్లచావిడి ప్రాంతం వణికిపోయింది. రక్తమోడుతున్న వ్యక్తులు.. అడ్డుకోబోతున్న కొద్దీ అంతమొందించే ప్రయత్నం.. కనికరం లేని కత్తులు కుత్తుకుల వైపునకు దూసుకొస్తుంటే చూస్తున్న ప్రజల గుండె జారిపోయింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అల్లరిమూకలు సాగించిన అరాచకం అలజడి సృష్టించింది.
డోన్ టౌన్: వేలం పాటను దక్కించుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు సాగించిన అరాచకంతో డోన్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అడ్డుతగులుతున్నారనే అక్కసుతో వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై కత్తిదూసి వెంటాడి వేటాడిన తీరు ఫ్యాక‌్షన్ సినిమాను తలపించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం విమర్శలకు తావిస్తోంది.
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు దిన, వార కూరగాయల మార్కెట్లకు వేలం పాట నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్నగౌడ్‌తో పాటు ఆయన అనుచరులు వేలంలో పాల్గొనేందుకు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులు పోస్టు ప్రసాద్, ఓబులాపురం గొల్ల సుధాకర్, గొల్ల రమణ, గొల్ల మదన్‌లు వేలంలో పాల్గొన్నారు. చర్చల పేరిట వీరిని సమీపంలోని దస్తగిరి స్వామి పీర్లచావిడి వద్దకు తీసుకెళ్లారు. ఆ సందర్భంగా కేశన్నగౌడ్, చక్రపాణిగౌడ్‌లతో పాటు సుమారు 40 మంది అనుచరులు వీరిపై దాడికి పాల్పడ్డారు. కత్తులు, ఇనుపరాడ్లు, పట్టుడు కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. తలలు పగిలి రక్తమోడుతున్నా కనికరం లేకుండా కత్తిదూసిన తీరుతో ఆ ప్రాంతం వణికిపోయింది. చుట్టుపక్క నివాసితులు భయాందోళనతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకోవడం అక్కడి పరిస్థితికి అద్దం పట్టింది. గాయపడిన వ్యక్తుల్లో ఎవరూ బతికే అవకాశం లేదన్నట్లుగా దాడి జరిగింది.
కనిపించని బందోబస్తు
మున్సిపల్ కార్యాలయం వద్ద వేలం పాటలు నిర్వహిస్తుండగా నలుగురు పోలీసులను బందోబస్తుగా నియమించారు. అయితే కార్యాలయానికి వంద అడుగుల దూరంలో టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా దాడులకు తెగబడుతుండగా ఒక్క పోలీసు మాత్రమే నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే పదుల సంఖ్యలోని అల్లరిమూకలను ఆయన అడ్డుకోలేకపోయారు. ఆ సమయంలో మిగిలిన ముగ్గురు పోలీసులు ఏమయ్యారనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. దాడుల సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు.
వేలంపాటలో దాడి సుత్రధారులు
వందలాది మంది చూస్తుండగానే వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై దాడులకు ఉసిగొల్పిన మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్, టీడీపీ నేత చక్రపాణి గౌడ్‌లు తిరిగి వేలం పాటల్లో దర్జాగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వేలం పాట ముగిసే వరకు పోలీసులు అక్కడే బందోబస్తుగా ఉన్నారు తప్పిస్తే ఎవరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
ఏకపక్షంగా వేలం పాటలు
పాటదారుల్లో పోటీ లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు దర్జాగా వేలం దక్కించుకున్నారు. తూతూమంత్రంగా సాగిన ఈ వేలం పాటల్లో వారికి వారే వేలం మొత్తాన్ని పెంచి మమ అనిపించారు. వేలంలో ఎవరైనా పాల్గొంటే గత ఏడాది మొత్తాన్ని రెట్టింపు చేయాల్సి వస్తుందనే భావనతో వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు.
పెరిగింది రూ.4లక్షలే
గత ఏడాది దిన మార్కెట్ వేలం రూ.7.80లక్షలు కాగా.. శుక్రవారం జరిగిన వేలంలో రూ.9.50లక్షలు, వారం మార్కెట్ రూ.2.60 లక్షలు ఉండగా.. తాజా వేలంలో రూ.3.50లక్షలు, బస్టాండ్ వేలం గత ఏడాది రూ.10లక్షలు కాగా.. ఈ విడత రూ.11.30లక్షలు, జంతువధ శాల గత ఏడాది రూ.లక్ష పలుకగా.. ప్రస్తుతం రూ.1.15 లక్షలకే ముగిసింది. అంటే.. మొత్తం మీద రెట్టింపు కావాల్సిన వేలం పాట కాస్తా రూ.4.05లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏకపక్షంగా సాగిన వేలం పాట విషయమై మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబును ‘సాక్షి’ ప్రశ్నించగా.. పాటదారులు ఎవరనే విషయంతో తమకు సంబంధం లేదన్నారు. ఎవరో కొందరు హాజరు కాలేదని వేలం పాటలను వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. కార్యాలయం బయట జరిగిన విషయాలు తమకు తెలియవన్నారు.
నిందితులపై రౌడీషీట్లు
మున్సిపల్ కార్యాలయం వద్ద దాడులకు తెగబడిన వారిపై రౌడీషీట్లు తెరుస్తామని ఏఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడి జరిగిన తీరును డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్‌ఐ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే 20 మందిని గుర్తించామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు.
Advertisement
Advertisement