అక్రమార్కులపై కొరడా | attacks vigilance officers | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై కొరడా

Published Wed, Dec 21 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

అక్రమార్కులపై కొరడా

అక్రమార్కులపై కొరడా

నాలుగు చోట్ల విజిలెన్స్‌ బృందాల తనిఖీలు
తేటగుంట, సీతంపేట, కత్తిపూడి, ప్రత్తిపాడుల్లో సరుకు స్వాధీనం
రూ.22.30 లక్షల విలువైన తారు, ఇనుము, ఫర్నిస్‌ ఆయిల్‌, లారీలు సీజ్‌
జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు రూ.22.30 లక్షల విలువైన రెండు లారీలు, తారు, ఫర్నిస్‌ ఆయిల్, ఇనుము స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్‌ ఎస్పీ టి.రాంప్రసాద్‌ ఆదేశాలతో బుధవారం నాలుగు ప్రత్యేక బృందాలు తుని మండలం తేటగుంట, తొండంగి మండలం సీతంపేట, శంఖవరం మండలం కత్తిపూడి, ప్రత్తిపాడుల్లో తెల్లవారుజామున ఆకస్మిక దాడులు జరిపాయి. ఆయా దాడుల్లో 97 పీపాల్లో 19,500 కిలోల తారు, మూడు వేల లీటర్ల ఫర్నిస్‌ ఆయిల్, రూ.ఏడు లక్షల విలువైన ఇనుము, రెండు లారీలు పట్టుబడ్డాయి.
- తుని రూరల్‌
 
తేటగుంట, సీతంపేటల్లో పట్టుబడిన తారు, ఫర్నిస్‌ ఆయిల్, లారీని ఆయా గ్రామాల వీఆర్వోలకు, ప్రతిపాడు, కత్తిపూడిల్లో పట్టుబడిన లారీ, ఇనుము, తారును ఆయా పోలీసు స్టేషన్లకు అప్పగించి, క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. దాడులు జరిగిన ప్రాంతాలను విజిలెన్స్‌ ఎస్పీ టి.రాంప్రసాద్, డీఎస్పీ పి.రాజేంద్రప్రసాద్, సీఐ భాస్కరరావు పరిశీలించారు. బిల్లులు లేకుండా అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్న సమాచారంతో ఏకకాలంలో ఈ దాడులు చేసినట్టు ఎస్పీ రాంప్రసాద్‌ పేర్కొన్నారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
 
తేటగుంటలో.. : విజిలెన్స్‌ ఏఓ (వ్యవసాయ శాఖ) జి.శ్రీనివాస్, ఏజీ రంగకుమార్, ఎంఎస్‌ఓ డీఎస్‌ఎస్‌ఆర్‌ మూర్తి, కానిస్టేబుల్‌ స్వామి బృందం దాడుల్లో 40 పీపాల్లో 8 వేల కిలోల తారు, నేలమాలిగలో 3 వేల లీటర్ల ఫర్నిస్‌ ఆయిల్, లారీని సీజ్‌ చేసి, వీఆర్వో రామన్నదొరకు అప్పగించారు.
సీతంపేటలో.. : విజిలెన్స్‌ సీఐ రామ్మోహన్‌రెడ్డి, ఇంజనీర్‌ సాయిబాబా ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. 40 పీపాల్లో 8 వేల కిలోల తారు సీజ్‌ చేసి, వీఆర్వోకు అప్పగించారు.
కత్తిపూడిలో.. : డీసీటీఓలు రత్నకుమార్, కృష్ణారావు సంయుక్తాధ్వర్యంలో దాడులు నిర్వహించారు. లారీ సహా రూ.ఏడు లక్షల విలువైన ఇనుము స్వాధీనం చేసుకున్నారు. లారీ, ఇనుమును పోలీసులకు అప్పగించి, క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.
ప్రత్తిపాడులో.. : విజిలెన్స్‌ ఎస్సై సత్యనారాయణ, ఎఫ్‌ఆర్‌ఓ వల్లీ ఆధ్వర్యంలో దాడులు చేశారు. 17 పీపాల్లో నిల్వ చేసిన 3,500 కిలోల తారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో కేసు నమోదై ఉండడంతో ఇప్పుడు క్రిమినల్‌ కేసు నమోదు చేసి, పోలీసులకు సరుకు అప్పగించారు.
పక్కా సమాచారంతో.. తెల్లవారుజామున... 
కత్తిపూడి(శంఖవరం) / తొండంగి : శంఖవరం మండలం కత్తిపూడి, తొండంగి మండలం తమ్మయ్యపేటల్లో బుధవారం తెల్లవారుజామున విజిలెన్స్‌ అధికారులు అక్రమ వ్యాపారాలపై దాడులు జరిపారు. సుమారు రూ.4 లక్షల విలువైన ఇనుము, తారు నిల్వలను, రెండు లారీలను సీజ్‌ చేశారు. విజిలెన్స్‌ అధికారులు కృష్ణారావు, రత్నకుమార్, రామ్మోహన్‌రెడ్డి రెండు బృందాలుగా ఈ దాడులు జరిపారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు రీజినల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రాంప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కత్తిపూడి మారుతి స్టోన్‌ క్రషర్‌ ఆవరణలో విశాఖపట్నం నుంచి విజయవాడకు ఇనుము తరలిస్తున్న రెండు లారీలను గుర్తించారు. ఓ లారీలో నుంచి అక్రమ వ్యాపారులు సుమారు రూ.లక్ష విలువైన రెండున్నర టన్నుల ఇనుప ఊచలను అన్‌లోడ్‌ చేశారు. వీటితోపాటు ఆ ఆవరణలో ఇనుము అన్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉంచిన మరో లారీని గుర్తించి, సీజ్‌ చేశారు. లారీ డ్రైవర్లు వెంకన్న, నూకరాజుతో పాటు ఇనుము అక్రమ వ్యాపారం చేస్తున్న గొల్లపల్లి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని, వీరిపై కేసులు నమోదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే తమ్మయ్యపేట జంక‌్షన్‌ వద్ద పెట్రోలు బంకు వెనుక అక్రమంగా నిల్వ ఉంచిన 200 లీటర్ల కెపాసిటీ కలిగిన 39 డబ్బాల్లో డి-గ్రేడ్‌ తారును విజిలెన్స్‌ సీఐ రామ్మోహన్‌రెడ్డి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తారు అక్రమ వ్యాపారం చేస్తున్న అముజాల రామకృష్ణపై కేసు నమోదు చేస్తున్నట్టు విజిలెన్స్‌ సీఐ తెలిపారు. అక్రమ నిల్వలు ఉన్న ప్రాంతాలను రీజినల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రామ్‌ప్రసాదరావు పరిశీలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement