ఆటో, బస్సు ఢీ: ఒకరి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు: ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలపాలవ్వగా వారిలో ఒకరు మృతిచెందిన ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పది మంది ప్రయాణికులతో పెదనందిపాడు మండలం రావిపాడు నుంచి ప్రత్తిపాడుకు వస్తున్న ఆటో ప్రత్తిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఎదురుగా వెళుతున్న ఓ ప్రైవేట్ కళాశాల బస్సును క్రాస్ చేయబోయి వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆటో అదే సమయంలో ప్రత్తిపాడు వైపు నుంచి పెదనందిపాడు వైపు వెళుతున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రావిపాడుకు చెందిన పల్లపాటి శిలవయ్య, కందుల నాగేశ్వరరావు, శిఖా సునీల్‌కుమార్, కొండబోలు పద్మావతి గాయాలపాలయ్యారు. వీరిలో పల్లపాటి శిలవయ్యకు తీవ్ర గాయాలవడంతో అతనిని 108లో గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గాయాలపాలైన నాగేశ్వరరావు, సునీల్‌కుమార్‌కు ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్యకేంద్రంలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం జీజీహెచ్‌కు పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఎస్‌ఐ ఖాదర్ బాషా ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవడంతో పెనుప్రమాదం తప్పింది.