హత్యకేసులో ఆటోడ్రైవర్‌కు జీవిత ఖైదు
Published Mon, Aug 28 2017 10:59 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
తణుకు: ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 2014లో జరిగిన హత్య కేసులో తణుకుకి చెందిన ఆటో డ్రైవర్‌కు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తణుకు సీఐ చింతా రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాలంగి గ్రామానికి చెందిన బొద్దాని ఆదినారాయణ అలియాస్ బుజ్జి 2014 నవంబర్ 16 వేకువజామున 4 గంటల సమయంలో ఇంటి గుమ్మం వద్ద తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. గమనించిన తల్లి బొద్దాని సీతామహాలక్ష్మి గ్రామానికి చెందిన పీఎంపీ సాయంతో తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కుమారుడు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతోనే మృతి చెందినట్టు తల్లి ఉండ్రాజవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తణుకుకి చెందిన పల్లా వెంకటేష్ అలియాస్ ఆటో వెంకీ, పాలా రామకృష్ణ అనే వ్యక్తులపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అప్పటి ఎస్సై పీవీ రమణ కేసు నమోదు చేసి సీఐ జి.మధుబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. అనంతరం అప్పటి సీఐ ఆర్.అంకబాబు పల్లా వెంకటేష్ అలియాస్ ఆటో వెంకీపై చార్జిషీటు దాఖలు చేసి నవంబర్ 11న రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో తణుకు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జీజీ కేశవరావు నిందితుడికి జీవిత ఖైదు ఖరారు చేసి రూ. 2 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కేఎస్‌ఎల్‌ఎన్ ప్రసాద్ వాదించగా తణుకు సీఐ చింతా రాంబాబు, ఉండ్రాజవరం ఎస్సై కె.గంగాధరరావు, కానిస్టేబుల్ జీఎస్‌ఆర్‌కే పరమహంస సహకరించారు.
Advertisement